తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ఘోరంగా ఓడింది. ఇక్కడ బీజేపీ గెలిచింది వెయ్యి ఓట్ల మెజార్టీతోనే కావొచ్చు. కానీ రెండేళ్ల క్రితం ఇదే సీటును టీఆర్ఎస్ ఏకంగా 62 వేల ఓట్ల మెజార్టీతో గెలుచుకుంది. పైగా సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోతే ఆయన కుటుంబ సభ్యులకే సీటు ఇచ్చినా.. ఎలాంటి అంచనాలు లేకుండా బీజేపీ సంచలన విజయం సాధించింది. ఈ మెజార్టీ చాలా స్వల్పమే. టీఆర్ఎస్ నాయకులు అతి ధీమాతో ఇక్కడ ప్రచారం కూడా చేయకుండా తమకు ఏకంగా లక్ష ఓట్ల మెజార్టీ వస్తుందని గొప్పలకు పోయారు.
ప్రచారంలో మంత్రి హరీష్‌రావు మినహా ఎవ్వరూ లేకుండా పోయారు. అసలు కేటీఆర్, కేసీఆర్ అటు వైపే తొంగి చూడలేదు. ఈ దారుణ పరాజయాన్ని టీఆర్ఎస్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది. అక్కడ ఓటమికి చాలా కారణాలు ఉన్నా కేసీఆర్ ఒక్క బహిరంగ సభ పెట్టినట్లయితే ఖచ్చితంగా టీఆర్ఎస్ అక్కడ భయట పడేదే అంటున్నారు. ఆయన మాటలతో గ్రామీణ ప్రాంత ప్రజల్లో కొందరిలో అయినా మార్పు వస్తే దుబ్బాకలో స్వల్ప మెజార్టీతో అయినా టీఆర్ఎస్ గెలిచి ఉండేది. గతంలో ఎన్నో ఎన్నికల్లో కేసీఆర్ బహిరంగ సభలు ఆ పార్టీకి తిరుగులేని విజయం ఇచ్చాయి.
అయితే దుబ్బాక ఉప ఎన్నికల్లో కేసీఆర్ వేసిన ఈ రాంగ్ స్టెప్‌ను గ్రేటర్ ఎన్నికల్లో రిపీట్ కాకుండా చేయాలని ఆ పార్టీ అధిష్టానం డిసైడ్ అయ్యింది. గ్రేటర్లో కేసీఆర్ బహిరంగ సభ ఉండేలా ప్లాన్ చేస్తోంది. ఈ బహిరంగ సభే గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో హైలెట్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. గత గ్రేటర్ ఎన్నికల్లో లాగానే ఈ ఎన్నికల్లో కూడా కేసీఆర్ ఓ బహిరంగ సభకు హాజరు అవుతారని అంటున్నారు. ఈ నెల 28 లేదా 29న ఎల్బీ స్టేడియంలో ఈ సభ జరిగేలా ప్లాన్ చేస్తున్నారు.
గ్రేటర్లో అన్ని డివిజన్లలో పోటీ చేస్తోన్న పార్టీ కార్పొరేటర్ అభ్యర్థులు అందరూ ఈ సభకు హాజరు అవుతారు. ఈ సభతో పార్టీకి తిరుగులేని జోష్ వస్తుందని పార్టీ వర్గాలు లెక్కలేసుకుంటున్నాయి. ఇప్పటికే మంత్రి కేటీఆర్ సైతం ప్రచారంలో తిరుగులేని వ్యూహలు పన్నుతున్నారు. బీజేపీ వేస్తోన్న ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. మరి ఈ వ్యూహాలు టీఆర్ఎస్‌ను ఎంత వరకు గట్టెక్కిస్తాయో ? చూడాలి