తండ్రి చాటు బిడ్డగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చంద్రబాబు తనయుడు లోకేష్ ఇప్పటికీ ఆ ముద్ర నుంచి బయటకు రాలేకపోతున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో లోకేష్ కాస్త స్వతంత్రంగా వ్యవహరించేందుకు ప్రయత్నించారు. ఆ మేరకు చంద్రబాబు ఆయనకు స్వేచ్ఛ ఇచ్చారు. కానీ లోకేష్ సమర్థవంతంగా వినియోగించుకోలేక, పార్టీ నేతలపైనా, ఎమ్మెల్యేలపైన పెత్తనం చేసేందుకు ప్రయత్నించడం, వారిని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం వంటి పరిణామాలతో లోకేష్ పై నాయకుల్లో మరింత ఆగ్రహం పెరగడంతో పాటు, ఆయన అసమర్ధుడు అనే విషయాన్ని బయటకు చాటిచెప్పారు. టిడిపి నుంచి ఏ నాయకుడు బయటకు వచ్చేసినా, తప్పనిసరిగా లోకేష్ పేరు చెబుతూ, ఆయనపై విమర్శలు ఎక్కుపెట్టారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సైతం పార్టీకి రాజీనామా చేసే సమయంలో లోకేష్ ని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేయడం, లోకేష్ చేసే అక్రమాలు బయటపెట్టడంతో, లోకేష్ పరువు బజారున పడింది.
వీరేకాక చాలామంది నాయకులు లోకేష్ ని టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేసేవారు. దీనికి తగ్గట్టుగానే ఆయన వ్యవహార శైలి ఉండేది అనేది అప్పట్లో నడిచిన టాక్. ఇప్పటికీ లోకేష్ వ్యవహార శైలిపై విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. పార్టీ ఉనికి కోసం ఆరాటపడుతున్న ఈ సమయంలో ఇంకా లోకేష్ ట్విట్టర్ పుట్టగానే మిగిలి పోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఒక వైపు చూస్తే చంద్రబాబు వయస్సు పెరిగిపోతుంది. ఎంతోకాలం రాజకీయాలలో యాక్టివ్ గా ఉండేందుకు అవకాశం లేదు. ఇప్పటికే విశ్రాంతి తీసుకునేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఇదిలా ఉంటే, లోకేష్ తన పని తీరు ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటున్నాడా అంటే ఆ విధంగా వ్యవహరించడం లేదు.
అసలు ఇల్లు దాటి బయటకు వచ్చేందుకు ఇష్టపడడంలేదు. ఇవన్నీ టిడిపికి పెద్ద మైనస్ గా మారింది. చంద్రబాబు కనుసన్నల్లో టిడిపి సీనియర్ నాయకులు ఉన్నా, యువ నేతలను ఆకర్షించడంలో లోకేష్ ఘోరంగా విఫలమవుతున్నారు అనే వాదనలు లేకపోలేదు. నాయకులంతా తనకు అండగా ఉండేలా చేసుకుని, రానున్న రోజుల్లో తన భవిష్యత్ కు బంగారుబాట వేసుకునే అవకాశం ఉన్నా, లోకేష్ ఆ విధంగా ప్రయత్నాలు చేయడం లేదు. దీంతో టిడిపి యువ నాయకులు అంతా పక్క పార్టీల వైపు చూస్తున్నారు. టిడిపిలో ఉంటే, తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదనే అభిప్రాయానికి వచ్చేశారు. సైకిల్ యాత్ర అంటూ లోకేష్ ప్రజా బలం పెంచుకెందుకు ప్రయత్నం చేస్తున్నారు.
ఎన్ని యాత్రలు చేసినా, పార్టీ నాయకులను ఆకట్టుకోవడంలో విఫలం అవ్వడంతో ఎవరికీ లోకేష్ సామర్ధ్యం పై నమ్మకం ఏర్పడడం లేదు. అసలు లోకేష్ టిడిపి బావి వారసుడిగా, కాబోయే ముఖ్యమంత్రి అనే చర్చ ప్రజల్లో జరగడమే లేదు. అసలు లోకేష్ కు సీఎం అయ్యే అర్హత లు ఉన్నాయా అనే సెటైర్లు పడుతున్నా, దానికి సమాధానం చెప్పుకోలేని స్థితిలో తెలుగుదేశం పార్టీ ఉండిపోతుంది. జరిగిన నష్టం ఎలాగూ జరిగింది. ఇక లోకేష్ తన తండ్రి బాటలో వెళ్లి పార్టీపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చేసింది.
ఇప్పటికే చంద్రబాబు ఏదో ఒక రూపంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కలిగించే విధంగా వ్యవహరిస్తూ, ఎవరు చేజారిపోకుండా ప్రయత్నాలు చేస్తూ, పార్టీకి ఊపు తెచ్చే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. లోకేష్ కూడా బాబు బాటలోనే పయనించి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కలిగించే విధంగా కార్యక్రమాలు చేస్తూ, నిత్యం యువ నాయకులతో టచ్ లో ఉంటూ, వారి సలహాలు, సూచనలు పాటిస్తూ, పార్టీలో అందరివాడు గా పేరు సంపాదించుకోవాలి. పార్టీలో తన మాటకు ఎదురు లేకుండా చేసుకుని రాజకీయ మేధావిగా నిరూపించుకుంటే, ఆ తర్వాత పరిస్థితులను బట్టి ఆయన సీఎం అయినా, ఆశ్చర్యపోనవసరం లేదు. కాకపోతే లోకేష్ తన లోపాలను మొత్తం సరిదిద్దుకుంటేనే ఇది సాధ్యమవుతుంది.
-Surya