టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) తనదైన శైలిలో రాజకీయాలు చేసుకుంటూ ముందుకెళుతున్నారు. తన ప్రత్యర్ధి పార్టీ అయినా టీఆర్ఎస్‌కు చెక్ పెట్టడమే లక్ష్యంగా రేవంత్ ముందుకెళుతున్నారు. నిత్యం ఏదొక అంశంపై టీఆర్ఎస్‌ని ఇరుకున పెట్టేందుకు చూస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీకి చెక్ పెట్టడానికి కూడా రేవంత్ ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ-టీఆర్ఎస్‌లు వేర్వేరు కాదనే మాట్లాడుతున్నారు. పరోక్షంగా ఈ రెండు పార్టీలు కలిసికట్టుగా ముందుకెళుతున్నాయని చెబుతున్నారు.
అయితే రేవంత్ విమర్శల్లో కాస్త లాజిక్ ఉన్నట్లే కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు ఆ రెండు పార్టీల రాజకీయాలని చూస్తే కాస్త అనుమానం కలుగుతుందని అంటున్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్-బీజేపీలు ఉప్పు-నిప్పు మాదిరిగా ముందుకెళుతున్నాయి. కానీ కేంద్రంలో మాత్రం మంచిగా దోస్తీతో ముందుకెళుతున్నట్లు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఇటు కేసీఆర్‌పై బీజేపీ నేతలు అనేక అవినీతి ఆరోపణలు చేయడం, ఆయన జైలుకెళ్లడం ఖాయమని హడావిడి చేస్తారు గానీ, ఆ అవినీతి ఆరోపణలని రుజువు చేసే ప్రక్రియ చేపట్టారు.
అటు టీఆర్ఎస్ రాష్ట్రంలో నీటి విషయంలో పక్క రాష్ట్ర సీఎం జగన్ మోహన్‌పై ఏ స్థాయిలో విమర్శలు చేస్తారో అందరికీ తెలిసిందే. పైగా కేసీఆర్ సైతం, నీటివిషయంలో ఏపీ ప్రభుత్వం దాదాగిరి చేస్తుందని మాట్లాడుతున్నారు. కానీ అదే టీఆర్ఎస్ ఎంపీలు లోక్‌సభ, రాజ్యసభల్లో ఏ మాత్రం నోరు మెదుపుతున్నట్లు కనిపించడం లేదు. పార్లమెంట్ సమావేశాలు మొదలయ్యి 20 రోజులు దాటిన ఒక్కరోజు కూడా పార్లమెంట్‌లో నీటి వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్లు కనిపించలేదు. అలాగే విభజన హామీలని అమలు చేయాలని గట్టిగా డిమాండ్ చేసినట్లు లేరు.
పైగా మోడీ వ్యతిరేక శక్తుల సమీకరణ కోసం రాహుల్ గాంధీ పార్లమెంటులో పలు ప్రతిపక్ష ఎంపీలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాకుండా టీఆర్ఎస్, పూర్తిగా బీజేపీకి మద్ధతు పలికిందని రేవంత్ మాట్లాడుతున్నారు. మొత్తానికైతే టీఆర్ఎస్ రాష్ట్రంలో ఒకలా, కేంద్రంలో మరొకలా రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తోంది.