ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా తమ పార్టీ విజయదుందుభి మోగించడం ఖాయమనే అంచనాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులున్నాయి. ఏపీలోని స్థానిక సంస్థల ఎన్నికల్లో సాధించిన ఘనవిజయం ఆ పార్టీలో నూతన ఉత్తేజాన్ని నింపింది. అంతటి నమ్మకంతో ఉన్న ఆ పార్టీలో ఇప్పుడిప్పుడే సరికొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. నిన్నటి వరకు ఉన్న నమ్మకం కాస్తా రోజురోజుకు అపనమ్మకంగా మారుతోంది. ఈసారి వస్తామంటామా.. కొంచెం అనుమానంగా ఉందే.. అంటూ శ్రేణులు మాట్లాడుకుంటున్నాయి. ఇటువంటి అనుమానం రావడానికి దారితీసిన పరిస్థితులేమిటి? అందుకు కారణాలేమిటి?
సుప్రీం న్యాయమూర్తిపై ఫిర్యాదు డిస్మిస్
ప్రజలంతా తమవైపు ఉన్నారనుకుంటున్న తరుణంలో వరుసగా ఎదురుదెబ్బలు తగలడంతో ఆ పార్టీలో భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. తాము చేయాలనుకున్న పనులన్నీ పూర్తిచేసి, మంచి మంచి పథకాలతో ప్రజల్లో చెరగమని ముద్ర వేసుకొని ఏడాది ముందుగానే ఎన్నికలకు ప్రణాళికలు రచించుకొని సిద్ధమవుదామనుకుంటే ఇప్పుడేంటి ఇలా జరుగుతోంది? సుప్రీంకోర్టు జస్టిస్ రమణపై లేఖ రాస్తే చీఫ్‌జస్టిస్ బోబ్దే డిస్మిస్ చేశారు. ఇవన్నీ తప్పుడు ఆరోపణలంటూ కొట్టిపారేశారు. కేంద్రం కూడా ఏం జోక్యం చేసుకున్నట్లు కనపడలేదు. ఇప్పుడేం చేయాలో అర్థంకావడంలేదే అంటూ వాపోతున్నారు.
హోదాను కాకెత్తుకెళ్లింది
అంతేకాకుండా 2017లో విశాఖ పోలీసులు తనను నెట్టేశారంటూ ఎంపీ విజయసాయిరెడ్డి పార్లమెంటరీ స్థాయిసంఘానికి చేసిన ఫిర్యాదు కూడా కొట్టేశారు. విలువైన సమయాన్ని వృథా చేశారంటూ సంఘం ఎంపీపై అసహనాన్ని వ్యక్తం చేసింది. దీనికితోడు రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇస్తానంటూ హామీ ఇచ్చిన నరేంద్రమోడీ ఇప్పుడు దాన్ని గురించి మాట్లాడటంలేదు. హోదా తెస్తానని జగన్ ఎన్నికలకు ముందు ప్రజలకు హామీ ఇచ్చారు. లోక్‌సభలో టీడీపీ, వైసీపీ ఎంపీలడిగిన ప్రశ్నలకు హోదా ఇచ్చేది లేదని స్పష్టంగా చెప్పేసింది. ఇప్పుడు ప్రజలకేం సమాధానం చెప్పాలో అర్థంకావడంలేదంటూ నేతలు వాపోతున్నారు.
ఒకవైపు విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటుపరం చేయడానికి ప్రయత్నాలు శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు అదానీ రామాయపట్నం, గంగవరం పోర్టులతోపాటు ఉన్న కంపెనీలన్నింటినీ చేజిక్కించుకునే ప్రయత్నాల్లో తలమునకలై ఉంది. జనగణన పూర్తయ్యేవరకు ఎట్టిపరిస్థితుల్లోను కొత్తజిల్లాల ఏర్పాటు సాధ్యం కాదని తేలిపోయింది. తమదగ్గర అటువంటి ప్రతిపాదనేదీ లేదని భారత రిజిస్ట్రార్ జనరల్ వెల్లడించారు. ఒకదానిమీద ఒకటి, మరొకటిగా తగులుతున్న ఎదురుదెబ్బలు ఆ పార్టీని, నేతలను కుదురుగా ఉండనీయడంలేదు. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెరవెనక ఎక్కడైనా మంత్రాంగం నడుస్తోందా? అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులను తమ నేత సమర్థవంతంగా తిప్పికొడతారనే నమ్మకంతో వైసీపీ శ్రేణులున్నాయి.