టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పొత్తు అంత వీజీయా?. మరి.. సీట్ల పంపకంలో తగ్గేదెవరు?

-

ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌ ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్‌లో చేర‌డం దాదాపు ఖాయమయింది. ఆయనకు కాంగ్రెస్ ఉపాధ్యక్ష పదవిని సోనియాగాంధీ ఆఫర్ చేసినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. దాంతో తెలంగాణలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య పొత్తు ఖాయమవుతుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా బీజేపీ నేతలు బలంగా ఈ వాదనను ముందుకు తెస్తున్నారు. కాబట్టి ఈ రెండు పార్టీలకు తామే ప్రత్యామ్నాయ‌మ‌ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యత్నిస్తోంది. మరి ఇదే ప్రశాంత్ కిశోర్ ఏపీలోని జగన్ నాయకత్వంలోని వైసీపీకి కూడా ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నారు. కానీ..అక్కడ మాత్రం వైసీపీ, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదురుతుంద‌నే ప్రచారం మాత్రం జరగడం లేదు. ఎందుకు? ఇలా ఒక్క తెలంగాణలో మాత్రమే జరుగుతోంది? బీజేపీ వ్యతిరేక వైఖరిని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తీసుకోవడమేనిన చెప్పుకోవచ్చు. జగన్ మాత్రం బీజేపీకి సానుకూలంగానే వ్యవహరిస్తున్నారు. దాంతో సహజంగానే పీకే మధ్యవర్తిత్వంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ మధ్య పొత్తు కుదురొచ్చునని అంటున్నారు.

అయితే.. తెలంగాణలో పరిస్థితి విరుద్ధంగా ఉందన్నది సుస్పష్టం. రెండు పార్టీలు ఎప్పుడు కలుస్తాయి? ఒకపార్టీ పైచేయిలో ఉన్నప్పుడు.. మరోపార్టీ కిందిస్థాయి లేదా బలహీన స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. గతంలో కర్ణాటకలో కాంగ్రెస్, జేడీఎస్ మధ్య పొత్తు కుదిరింది.

తమిళనాడులో డీఎంకే, కాంగ్రెస్ మధ్య పొత్తు ఉంది. కానీ..ఇక్కడ ఏదో ఒక పార్టీ అధిక సీట్లు తీసుకుని బరిలోకి దిగాయి. తమిళనాడులో డీఎంకేకు కాంగ్రెస్ జూనియర్ భాగస్వామి. అలాగే..కర్ణాటకలో జేడీఎస్ కాంగ్రెస్ కు జూనియ‌ర్‌. కానీ ఇక్కడ టీఆర్ఎస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ అధికారాన్ని కోరుకుంటోంది.రెండూ సమాన శక్తిని కలిగి ఉన్నాయి. ఈ సమయంలో బీజేపీ భయంతో ఈ రెండు పార్టీలు కలుస్తాయా? ఒకవేళ కలిసినా సీట్ల పంపకం ఎలా?

ఉన్నవి 119 సీట్లు. అప్పడు చెరిసగం పంచుకోవాల్సి ఉంటుంది. అంటే చెరి సమారు 60 సీట్లలో పోటీ చేయాల్సి ఉంటుంది. ఇది సాధ్యమేనా? కాంగ్రెస్ తో సమాన సీట్లకు కేసీఆర్ ఒప్పుకుంటారా? రేవంత్ తగ్గుతాడా? సరే..అధిష్ఠానం ఎలాగోలా ఒప్పించినా టీఆర్‌ఎస్ కంటే తక్కువ స్థానాల్లో కాంగ్రెస్ పోటీకి సిద్ధపడగ‌ల‌దా? టీఆర్ ఎస్ కు కేటాయించిన సీట్లలో ఆ స్థానాలను ఆశిస్తున్న కాంగ్రెస్ నేతలు ఊరికే ఉంటారా? అలాగ కాంగ్రెస్ కు కేటాయించిన స్థానాల్లోని టీఆర్‌ఎస్ ఆశావహ టికెట్ నేతలు నోరు మూసుకుంటారా?

ఇప్పుడున్నట్లుగా సిట్టింగ్ స్థానాల్లో టీఆర్ఎస్ పోటీ చేసి మిగతా వాటిని కాంగ్రెస్ కు ఇస్తే? అప్పుడు 88 స్థానాల్లో టీఆర్ఎస్, మిగతా 31 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేయాల్సి ఉంటుంది. ఈ మిగతా స్థానాల్లో దాదాపు 12 వరకు ఎంఐఎంకు అడ్డా. అప్పుడు కాంగ్రెస్ దాదాపు 20 స్థానాలకే పరిమితం అవుతుంది. ఈ స్థానాల్లోనే కాంగ్రెస్ పోటీ చేయ‌గ‌ల‌దా? ఈ గణాంకాలను పరిశీలించినప్పుడు పొత్తు సాధ్యంకాదనే అనిపిస్తోంది.

ఒక‌వేళ పొత్తు కుదిరితే మాత్రం.. పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చినట్లుగా బీజేపీకి అనుకూల వాతావరణం ఏర్పడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ అంశాలన్నింటినీ కాంగ్రెస్‌కానీ.. టీఆర్‌ఎస్‌గానీ ఆలోచించకుండానే గోదాలోకి దిగుతాయనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. అయితే.. రాజకీయాల్లో ఏదయినా సాధ్యమే అనేందుకు గతంలోనే ఉదాహరణలు ఉన్నాయన్నది మ‌నం మర్చిపోవద్దు.

Read more RELATED
Recommended to you

Exit mobile version