Breaking : బిగ్‌సీ అధినేత ఇంట్లో ఐటీ సోదాలు

-

ఐటీ అధికారులు వరుసపెట్టి ప్రముఖ సంస్థలతో పాటు ఆ సంస్థల అధినేతల ఇండ్లపై సోదాలు జరుపుతున్నారు. అయితే.. నేడు ఐటీ అధికారులు విజయవాడలో సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ మొబైల్స్ షోరూమ్ బిగ్ సీ అధినేత ఏనుగు సాంబశివరావు ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. సాంబశివరావు కుమారుడు స్వప్న కుమార్ బిగ్ సీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. అంతేకాదు, ఆనర్ హోమ్స్ లో భాగస్వామిగా కూడా ఉన్నారు. అయితే.. ఆనర్ హోమ్స్ లో రూ. 360 కోట్ల లావాదేవీలపై అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. గత రెండు రోజులుగా సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్, నెల్లూరుల్లో సైతం తనిఖీలను నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు. ఇదిలా ఉంటే.. ప్రముఖ వస్త్ర వ్యాపార సంస్థ ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌కు చెందిన షాపింగ్‌ మాల్స్‌, స్టోర్‌ రూమ్స్‌, ఇళ్లలో ఆదాయ పన్ను(ఐటీ) అధికారులు శుక్రవారం సోదాలు నిర్వహించారు.

దాదాపు 25 బృందాలు నగరంలోని పలు చోట్ల ఈ తనిఖీలు చేపట్టాయి. అమీర్‌పేట, కూకట్‌పల్లి, సికింద్రాబాద్‌, మెహిదీపట్నం, జంట నగరాల్లోని పలు ఇతర ప్రాంతాల్లో ఈ సోదాలు జరిగాయి. సనత్‌నగర్‌లో సిబ్బందిని లోపలికి అనుమతించకుండా గోదాములను తనిఖీ చేశారు. ఆర్‌ఎస్‌ బద్రర్స్‌ ఇటీవల రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పెట్టుబడులు పెట్టినట్లు వార్తలు వెలువడుతున్నాయి. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలోనే ఐటీ అధికారులు సోదాలను నిర్వహించినట్లు తెలిసింది. సంస్థ అకౌంట్లు, రికార్డులను అధికారులు పరిశీలించారు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారానికి సంబంధించిన లావాదేవీలను కూడా తనిఖీ చేశారు. కాగా, మరో రెండు సంస్థల్లో కూడా సోదాలు జరిపారు ఐటీ అధికారులు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version