కరోనా బారిన పడ్డ వారిలో చాలా మందికి రుచి, వాసన తెలియవు. కోవిడ్ వచ్చిందని నిర్దారించేందుకు ఈ రెండు లక్షణాలు ప్రధానమైనవని నిపుణులు ఎప్పుడో చెప్పారు. అయితే కోవిడ్ నుంచి కోలుకున్న తరువాత కొన్ని రోజులకు యథావిధిగా రుచి, వాసన తెలుస్తాయి. కానీ పూర్తిగా తెలిసేందుకు మాత్రం ఏడాది పడుతుందని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనంలో వెల్లడైంది.
ఫ్రాన్స్‌లోని స్ట్రాస్‌బర్గ్‌కు చెందిన యూనివర్సిటీ హాస్పిటల్స్‌కు చెందిన పరిశోధకులు కోవిడ్ బారిన పడి కోలుకున్న 97 మందిని ఏడాది పాటు పర్యవేక్షించారు. కోవిడ్ నుంచి కోలుకున్న తరువాత వారికి రుచి, వాసన ఎన్ని రోజులకు తెలుస్తున్నాయి ? అనే వివరాలను అడిగి తెలుసుకుని రికార్డు చేశారు. ఈ క్రమంలో వారిలో కొందరికి రుచి, వాసన త్వరగానే తెలిశాయి. కానీ కొందరికి అవి తెలిసేందుకు ఏడాది పట్టింది.
మొత్తం 97 మందిలో 51 మందికి 8 నెలల్లో రుచి, వాసన పూర్తిగా తెలిశాయి. 46 మందికి రుచి, వాసన పూర్తిగా తెలిసేందుకు ఏడాది పట్టింది. ఈ క్రమంలోనే వ్యక్తులను బట్టి ఇది మారుతుందని పరిశోధకులు తెలిపారు. అయితే చాలా మందికి మాత్రం రుచి, వాసన మునుపటిలా తెలిసేందుకు ఏడాది పడుతుందని నిర్దారించారు. ఇక ఈ పరిశోధనకు చెందిన వివరలను జామా నెట్‌వర్క్ ఓపెన్‌లో ప్రచురించారు.