హైదరాబాద్: ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోర్టులో నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై జగన్ సర్కార్ ఇప్పటికే కౌంటర్ కూడా దాఖలు చేసింది. ఈ కౌంటర్‌పై ఎంపీ రఘురామరాజు సమాధానమివ్వనున్నారు. రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల కోసమే రఘురామరాజు పిటిషన్ వేశారని, ఈ నెల 1న జగన్ తరపు లాయర్ కౌంటర్ దాఖలు చేశారు. కౌంటర్‌లో జగన్ పేర్కొన్న అంశాలపై రఘురామరాజు సోమవారం కోర్టుకు సమాధానం చెప్పనున్నారు. ఈ నేపథ్యంలో రఘురామ, వైసీపీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
కాగా ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఇప్పటికే లోక్ సభ స్పీకర్‌కు వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారని, రఘురామపై అనర్హత వేటు వేయాలని కోరారు. ఇక ఆయనపై ఏపీ సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసు విచారణ కొనసాగుతోంది. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రఘురామ వ్యవహారం ఉందని, ఆయనపై రాజద్రోహం కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే సీఐడీ అధికారులు తనను గాయపర్చారని రఘురామ ఆరోపిస్తున్నారు. వివిధ రాష్ట్రాల సీఎంలు, ఎంపీలకు లేఖల ద్వారా తనపై జరిగిన దాడిని వివరిస్తున్నారు. మద్దతు కూడగడుతున్నారు.