మరొకసారి చంద్రబాబు-పవన్ టార్గెట్ గా సిఎం జగన్ ఫైర్ అయ్యారు. పిఎం కిసాన్ పేరిట ప్రధాని మోదీ..సోమవారం రూ.2 వేలు రైతుల ఖాతాలకు పంపగా, తాజాగా వాటి కోసం మరోసారి బటన్ నొక్కారు. తెనాలి వేదికగా సభ పెట్టి..బాబు-పవన్ పై ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా బాబు-పవన్‌కు జగన్ ఒక సవాల్ చేశారు. వచ్చే ఎన్నికల్లో బాబు గాని, పవన్ గాని దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేయాలని సవాల్ విసిరారు.
అయినా వారికి పోటీ చేసే దమ్ము లేదని అన్నారు. ఇక నెక్స్ట్ ఎన్నికల్లో అధికారంలోకి రాకపోతే తాను రాజకీయాల్లో ఉండే పరిస్తితి లేదని చెప్పుకొచ్చారు. అంటే తాము 175 స్థానాల్లో పోటీ చేస్తాం గాని..టిడిపి-జనసేనలు మాత్రం 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ము లేదని, ఎందుకంటే వారు పొత్తులో పోటీ చేస్తారనే విధంగా జగన్ మాట్లాడారు. అయితే జగన్ సవాల్‌ని విశ్లేషిస్తే..పైకి ఏదో తాము సింగిల్ గా పోటీ చేస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్నారు గాని..టిడిపి-జనసేన కలిస్తే తమకు నష్టమనే సంగతి జగన్‌కు అర్ధమైంది.
అందుకే పరోక్షంగా చంద్రబాబు-పవన్ విడిగా పోటీ చేసేలా రెచ్చగొడుతున్నట్లు కనిపిస్తుంది. దమ్ముంటే 175 స్థానాల్లో పోటీ చేయాలని అంటున్నారు.. అలా అంటే చంద్రబాబు సింగిల్ గా, పవన్ సింగిల్ గా పోటీ చేస్తారు..మధ్యలో ఓట్లు చీలిపోయి తమకు లబ్ది చేకూరుతుందనే కాన్సెప్ట్ లో జగన్ ఉన్నట్లు ఉన్నారు.
గత ఎన్నికల్లో అదే జరిగింది. జనసేన ఓట్లు చీల్చడం వల్ల టిడిపికి నష్టం జరగగా, వైసీపీకి లబ్ది చేకూరింది. దాదాపు 50 స్థానాల్లో ఓట్ల చీలిక ప్రభావం ఉంది. అంటే ఆయా స్థానాల్లో టిడిపిపై వైసీపీకి వచ్చిన మెజారిటీల కంటే జనసేనకు పడిన ఓట్లు ఎక్కువ. అదే అప్పుడే టిడిపి-జనసేన కలిసి ఉంటే పరిస్తితి వేరేగా ఉండేది. ఈ సారి వైసీపీకి ఛాన్స్ ఇవ్వకూడదని చెప్పే బాబు-పవన్ కలవడానికి రెడీ అవుతున్నారు..కానీ వారిని రెచ్చగొట్టి విడిగా పోటీ చేయించాలని వైసీపీ ప్రయత్నిస్తుంది. ఇప్పుడు అదే పనిలో జగన్ పడ్డారు..ఆయన సవాల్ వెనుక ఇంత కథ ఉందనే చెప్పాలి.