ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోడీ భేటీ ముగిసింది. ఈ సందర్భంగా ఇరువురి మధ్య కీలక చర్చలు జరిగినట్టు సమాచారం. రాష్ట్ర రాజకీయ పరిణామాలు సహా పరిపాలనతో పాటుగా పలు కీలక విషయాలు ఇద్దరూ చర్చించారని తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిణామాలపై ప్రధానంగా ఇరువురు చర్చించారని, స్థానిక సంస్థల ఎన్నికల గురించి చర్చించారని అంటున్నారు.
విభజన హామీల గురించి చర్చ జరిగిందని సమాచారం. ఆర్ధిక లోటు భర్తీ చెయ్యాలని, అలాగే బడ్జెట్ లో నిధుల కేటాయింపు ఏమీ లేదని ప్రధాని దృష్టికి జగన్ తీసుకువెళ్ళారు. ప్రస్తుతం రాష్ట్రం అప్పుల్లో ఉంది కాబట్టి రాష్ట్రానికి ఎంతోకొంత ఆర్ధిక సహాయం చేసే విధంగా చూడాలని కోరినట్టు తెలుస్తుంది. ఇక ప్రత్యేక హోదా వస్తే అనేక సమస్యలు దూరమవుతాయని కూడా చెప్పినట్టు తెలుస్తుంది. మండలి రద్దు గురించి కూడా చర్చ జరిగినట్టు తెలుస్తుంది. మూడు రాజధానుల అంశం కూడా చర్చకు వచ్చింది.
పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిన రూ.3,800 కోట్లకుపైగా నిధులను విడుదల చేయాల్సిందిగా మోదీని సీఎం కోరారు. ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్రానికి సంబంధించిన పలు డిమాండ్ల సాధన కోసం సీఎం జగన్ ఇటీవలే ప్రధాని మోదీకి లేఖ రాశారు. వాటిపై చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఖ్యమంత్రి వైఎస్ జగన్ వెంట ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, గోరంట్ల మాధవ్ , మార్గాని భరత్, నందిగం సురేష్, శ్రీకృష్ణ దేవరాయలు, రెడ్డప్ప, బల్లి దుర్గాప్రసాద్, చింతా అనురాధ, ఉన్నారు.