అమరావతి: వైద్యారోగ్యశాఖలో నాడు నేడు కార్యక్రమంపై సీఎం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని ఆస్పత్రుల నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలపై అధ్యయనం చేసి పూర్తి వివరాలను సీఎం జగన్‌కు అధికారులు అందజేశారు. బిల్డింగ్, సర్వీసులు, నాన్ బిల్డింగ్ సర్వీసులపై అధ్యయన వివరాలను సీఎంకు తెలియజేశారు.
ఈ సందర్బంగా అధికారులకు సీఎం జగన్ కొన్ని ఆదేశాలు జారీ చేశారు. కొత్త వైద్య కళాశాలల పనులు యుద్ధ ప్రాతిపదికన జరగాలని ఆదేశించారు. శరవేగంగా వీటి పనులు జరగాలని సూచించారు. పనుల జరుగుతున్న తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. కొత్త మెడికల్‌కాలేజీల నిర్మాణాలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పారు. ఆస్పత్రుల ఆవరణ కూడా అత్యంత పరిశుభ్రంగా ఉండాలన్నారు. ఆస్పత్రి నిర్వహణకు సంబంధించి గట్టి ఎస్‌ఓపీలను తయారుచేయాలని సూచించారు.
పోటీపడుతున్నది ప్రభుత్వ ఆస్పత్రులతో కాదని, కార్పొరేట్ ఆస్పత్రులతో పోటీపడాలని అధికారులను జగన్ ఆదేశించారు. ప్రమాణాల విషయంలో వెనక్కి తగ్గకూడదని పేర్కొన్నారు. అనుకోని ప్రమాదాలు వచ్చే సమయంలో రోగులను భద్రంగా ఖాళీ చేయించే ఎమర్జెన్సీ ప్లాన్స్‌కూడా సమర్థవంతంగా ఉండాలన్నారు. కార్పొరేట్ ఆస్పత్రుల్లో అనుసరించే ప్రోటోకాల్స్‌పై అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం సూచించారు. అన్ని అంశాలనూ స్టడీ చేశాక సమగ్ర వివరాలతో నివేదిక ఇవ్వాలని జగన్ ఆదేశించారు.