పురుషుల్లో వారి ముక్కు సైజుని బట్టి వారి జననాంగ పరిమాణం ఉంటుందట. అంటే పొడవాటి ముక్కు ఉన్న వ్యక్తుల పురుషాంగం అదే తీరుగా ఉంటుందన్నమాట. జపాన్ లోని క్యోటో ప్రిఫెక్చురల్ వైద్య విశ్వవిద్యాలయం పరిశోధకులు చేసిన అధ్యయనంలో ఈ విషయం తేలిందట. పై రెండు శరీర భాగాల మధ్య ప్రత్యేకమైన సహ సంబంధం ఉంటుందని వీరి అధ్యయనంలో తేలినట్లు పరిశోధకులు తెలిపారు. పురుష శరీర నిర్మాణ శాస్త్రానికి సంబంధించిన ఓ మెడికల్ జర్నల్ లో ఈ అధ్యయనం ప్రచురితమైంది.
ఇందులో తేలిన వివరాల మేరకు.. పొడవాటి ముక్కున్న వ్యక్తుల పురుషాంగం నిటారుగా ఉన్నపుడు కనీసం 5.3 ఇంచీల మేర ఉంటుంది. అదే చిన్న ముక్కున్న పురుషుల్లో 4.1 ఇంచీలు మాత్రమే ఉన్నట్టు పేర్కొన్నారు. ఇంతకూ వీరు తమ పరిశోధన ఎవరి మీద చేశారంటే.. 126 మంది పురుషుల మృతదేహాలను పరిశీలించారు. వారు మరణించిన మూడు రోజుల్లోపు ఈ అధ్యయనం జరిగింది. అచేతనావస్థలో ఉన్న శవాలు కావడంతో వాటి పురుషాంగాలను చేత్తో లాగి కొలతలు తీసుకొన్నారు. ఈ అంశంపై మరింత విస్తృతంగా పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని జపాన్ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.
దీనిపై ఇతర పరిశోధకులు, శాస్త్రవేత్తలు మిశ్రమంగా స్పందిస్తున్నారు. కొందరు పురుషాంగానికి ముక్కుకు సంబంధం ఉండదని చెబుతున్నారు. పురుషుల్లో జననాంగం వారి జెనెటిక్స్, వారు తీసుకునే ఆహారం, వారిలోని హార్మోన్ల సమతుల్యతపై ఆధార పడి ఉంటుందని అంటున్నారు. మరికొందరేమో జపాన్ శాస్త్రవేత్తలకే ఓటు వేస్తున్నారు. సైన్స్ లో నిజంగానే ముక్కుకు జననాంగానికి మధ్య సంబంధం ఉంటుందని, అందువల్ల పురుషాంగం పరిమాణం ముక్కు సైజుపై ఆధారపడి ఉంటుందనడంలో సందేహం ఏం లేదని జపాన్ పరిశోధకుల అధ్యయనానికి మద్దతిస్తున్నారు. ఇందులో ఏది నిజమని తేలాలంటే దీనిపై మరిన్ని పరిశోధనలు జరగాల్సిందే.