తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన జూబ్లీహిల్స్ పబ్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో గంటకో ట్విస్ట్ వెలుగుచూస్తోంది. పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. ఈ కేసుకు సంబంధించి వరుసగా బయటికి వస్తున్న వీడియోలు పోలీసులను పరేషాన్ చేస్తున్నాయి. అసలు ఈ వీడియోలు ఎవరు లీక్ చేస్తున్నారన్నది మిస్టరీగా మారింది. అయితే ఈ విషయంలో కీలక పురోగతి సాధించారు హైదరాబాద్ పోలీసులు. జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై అత్యాచారం కేసులో మరొకరికి నోటీసులు ఇచ్చారు పోలీసులు. కారులో ప్రయాణిస్తున్న నిందితుల వీడియోలను సర్క్యులేట్ చేసింది పాతబస్తీకి చెందిన మీడియా ప్రతినిధి సుభాన్ గా గుర్తించారు.
అతనికి పోలీసులు నోటీస్ ఇచ్చారు. ఆర్ఎస్ మీడియా పేరుతో సుభాన్.. గ్యాంగ్ రేప్ బాధితురాలు నిందితులతో కలిసి కారులో ఉన్న వీడియోలను లీక్ చేయడంతో పాటు వైరల్ చేశారని పోలీసులు గుర్తించారు. సుభాన్ కు వీడియోలు ఎలా వచ్చాయని ఆరా తీస్తున్నారని తెలుస్తోంది. మైనర్ బాలిక వీడియోలు బయటికి రావడం వెనుక ఎవరున్నారు.. ఎందుకు వైరల్ చేశారు.. కావాలనే చేశారా లేక తమ మీడియా ప్రమోషన్ కోసం ఇలా చేశారా అన్న కోణంలో సుభాన్ ను పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.