ఈటల రాజేందర్ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కీలక ఘట్టంగా ఉంది. అయితే ఇప్పుడు ఆయన ఎపిసోడ్ కాస్త బీజేపీ గూటికి చేరింది. ఎన్నో మలుపులు, ఎన్నో ట్విస్టుల తర్వాత ఆయన కమలం గూటికి వెళ్తేనే తనకు రాజకీయా భవిష్యత్ ఉంటుందని భావించి ఆ పార్టీలో చేరారు. అయితే ఇప్పుడు ఆయన తర్వాత కూడా టీఆర్ ఎస్ నుంచి బీజేపీకి మరికొందరు వెళ్లనున్నట్టు తెలుస్తోంది.
ఇందులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు కడియం శ్రీహరి. ఉమ్మడి వరంగల్‌లో ఒకప్పుడు తిరుగులేని నేతగా ఉన్నారు. గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా, విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి వరంగల్‌లో ప్రతి ఎన్నికలు గతంలో ఈయన నేతృత్వంలోనే జరిగాయి.
అయితే ఇప్పుడు ఆయన్ను కేసీఆర్ మంత్రి వర్గంలోకి తీసుకోకుండా పక్కన పెట్టడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకోవైపు ఆయన ఎమ్మెల్సీ పదవి కూడా గడువు అయిపోవడంతో ఇప్పుడు ఆయన ఏ పదవి లేకుండా ఉన్నారు. ఈక్రమంలో మరోసారి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. కానీ కేసీఆర్ ఇంకోసారి అవకాశం ఇవ్వలేకపోతే బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఆయన చాలాకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. ఎర్రబెల్లి పోటీ ఆయనకు చాలా ఇబ్బందిగా మారింది. దీంతో ఆయన బీజేపీ వైపు చూస్తున్నారంట.