హైదరాబాద్‌ లో హై అలర్ట్ ప్రకటించిన కేసీఆర్‌..విద్యుత్‌ కోతలు ఉండొద్దని ఆదేశాలు !

-

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని వరద నీటి కాల్వల పరిస్థితి ఏమిటి? అన్నీ క్లియర్ గానే ఉన్నాయా? జల్ పెల్లి, ఫీర్జాదీగూడ వంటి చెరువుల పరిస్థితి ఎలా ఉంది? రాష్ట్ర వ్యాప్తంగా వరద సమయాల్లో విద్యుత్ వ్యవస్థ ఎలా ఉంది ? ప్రజలకు ఏవైనా ఇబ్బందులు తలెత్తాయా? అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉన్నదా? ఆయా శాఖల అధికారులు తీసుకున్న చర్యలేమిటి? అని మంత్రులు , అన్ని శాఖల ఉన్నతాధికారులను సీఎం కేసీఆర్ ఆరా తీశారు.

 


ప్రాణహిత, లక్ష్మీ బ్యారేజి, శ్రీపాద ఎల్లంపల్లి తదితర బ్యారేజీల నుంచి వరద ఎలా వస్తుందనే విషయాలన్నింటిపై ముఖ్యమంత్రి అధికారులను ప్రశ్నిస్తూ, సమగ్రంగా సమాధానాలు అడిగి తెలుసుకున్నారు. మొన్నటి వరదల సందర్భంగా వైద్యం,విద్యుత్, పంచాయితీ రాజ్, మున్సిపల్, ఆరండ్బీ, పోలీస్ తదితర శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి సహయ కర్యక్రమాలు నిర్వహించారని సీఎం అభినందించారు. భద్రాచలం వరద ముంపు ప్రాంతాల్లో వైద్యాధికారులు, సిబ్బంది బాగా పనిచేశారని, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీష్ రావును హెల్త్ డైరెక్టర్ ను వైద్యాధికారులు ను, సీఎం ప్రత్యేకంగా అభినందించారు.

ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా వున్నతీరు అభినందనీయం అన్నారు అదే స్ఫూర్తి తో అన్ని శాఖలు కూడా ఇవాళ్టి  విపత్తునుంచి ప్రజలను ప్రాణ నష్టం లేకుండా కాపాడుకోవాలనీ సీఎం తెలిపారు. డెంగ్యూ ప్రతి ఐదేండ్లకోసారి సైకిల్ గా వస్తోందని, ఇలాంటి వ్యాధులను ముందస్తుగానే అరికట్టాలని వైద్యాధికారులను సీఎం ఆదేశించారు.మున్సిపల్ కమిషనర్లు, జెడ్పీ సీఈవోలు, ఎంపీడీఓలు, ఆరోగ్యశాఖ, పంచాయతీరాజ్ తదితర శాఖల అధికారులు.. ఈ రెండు రోజులు సెలవులు అని అలసత్వంగా వ్యవహరించవద్దని, నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సీఎం కోరారు. హైదరాబాద్ పరిధిలో రోడ్ల పరిస్థితిపై జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్ ను సీఎం కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. దెబ్బ తిన్న నేషనల్ హైవే రోడ్లను పునరుద్ధరించబడుతున్నాయనీ సమావేశం లో పాల్గొన్న రోడ్లు భవనాలు శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి సీఎం కు వివరించారు. ఈ వరదల ద్వారా వచ్చిన అనుభవంతో సబ్ స్టేషన్లను వరదల్లో మునగకుండా ఎప్పటికప్పుడు పరిశీలించాలని, మొత్తం 11 కెవి సబ్ స్టేషన్లు ఏ విధంగా నియంత్రణలో ఉన్నాయనే సమాచారాన్ని సేకరించాలని సీఎం కేసీఆర్ విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news