హుజురాబాద్ ఎన్నికల్లో ఈటల రాజేందర్‌కి చెక్ పెట్టడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఎలాగైనా ఈటలని ఓడించాలని కెసిఆర్ అదిరిపోయే వ్యూహాలతో ఆట మొదలెట్టారు. ఇంకా ఉప ఎన్నికల షెడ్యూల్ రాకముందే మంత్రులు, ఎమ్మెల్యేలని హుజరాబాద్ లో దింపేసారు. ఎలాగైనా అక్కడ గులాబీ జెండా ఎగరాలనే లక్ష్యంతో వారు పనిచేస్తున్నారు.
ఈ క్రమంలోనే కెసిఆర్, హుజురాబాద్ ప్రజలని ఆకట్టుకునేందుకు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటికే హుజురాబాద్ అభివృద్ధికి వందల కోట్లను వెచ్చిస్తున్నారు. అటు అన్నీ వర్గాలని ఆకట్టుకునేందుకు పథకాలను ఎరగా వేస్తున్నారు. ఈ క్రమంలోనే హుజరాబాద్ లో కీలకంగా ఉన్న దళితులను ఆకట్టుకునేందుకు కొత్తగా దళిత బంధుని అమలు చేయడానికి సిద్ధమయ్యారు. ఈ స్కీమ్‌లో భాగంగా ఒకో దళిత కుటుంబానికి 10 లక్షలు డబ్బులు ఇస్తారని తెలుస్తోంది.
దీంతో నియోజకవర్గంలో ఉన్న 45 వేల దళితుల ఓట్లు టిఆర్ఎస్‌కు అనుకూలంగా మారే అవకాశం ఉందని విశ్లేషణలు వస్తున్నాయి. ఈ క్రమంలో దళితుల్ని ఈటలకు మరింత దూరం చేయడమే లక్ష్యంగా టిఆర్ఎస్ వ్యూహాలు పన్నుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే కొత్తగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి హుజురాబాద్‌కు చెందిన బండా శ్రీనివాస్‌కు అప్పగించారు. ఇదే సమయంలో ఈటలకు షాక్ కొట్టేలా అక్కడ ఓ ట్విస్ట్ వచ్చింది. దళిత బంధు గురించి ఈటల బామ్మర్ది మధుసూదన్ రెడ్డి వేరే వ్యక్తితో చాట్ చేసిన చాటింగు బయటపడింది. ఈ క్రమంలోనే దళితుల డబ్బుకు ఆశపడతారని, వారిని నమ్మడానికి వీల్లేదని ఈటల బామ్మర్ది మాట్లాడిన మాటలు హల్చల్ చేస్తున్నాయి.
దీనిపై హుజూరాబాద్ నియోజకవర్గంలోని దళితులు మండిపడుతున్నారు. ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఆధ్వర్యంలో ధర్నాలు కూడా చేస్తున్నారు. ఈటల బామ్మర్దిపై కేసు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆ చాటింగ్ ఫేకా… కాదా అనేది తెలియాల్సి ఉంది. కానీ ఇదంతా కుట్రపూరితంగా జరుగుతుందని ఈటల అనుచరులు చెబుతున్నారు. ఇదంతా టిఆర్ఎస్ వ్యూహంలో భాగంగా జరుగుతుందని, ఈటలకు దళితుల ఓట్లు దూరం చేయాలని చూస్తున్నారని అంటున్నారు. మరి చూడాలి దళితులు ఏ మేర ఈటలకు షాక్ ఇస్తారో?