తెలంగాణ రాజకీయాల్లో ప్రతిపక్షాలు ఏ స్థాయిలో అధికార టీఆర్ఎస్‌ని టార్గెట్ చేసి ముందుకెళుతున్నాయో తెలిసిందే. అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్‌లు టీఆర్ఎస్‌ని వాయించేస్తున్నాయి. ప్రజా సమస్యలపై తీవ్ర స్థాయిలో గళం విప్పుతున్నాయి. ఎక్కడకక్కడ రోడ్డు మీదకు వచ్చే పోరాటాలు చేస్తున్నాయి. ఈ పరిస్తితుల నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా నడుస్తున్నట్లు కనిపిస్తున్నాయి.
ప్రతి జిల్లాలోనూ టీఆర్ఎస్‌పై వ్యతిరేకత కనిపిస్తోంది. సీఎం స్థాయిలో కాకపోయిన చాలామంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకతని ఎదురుకుంటున్నారని తెలుస్తోంది. దీంతో బీజేపీ, కాంగ్రెస్‌లకు మంచి అడ్వాంటేజ్ వచ్చింది. ఈ అంశాన్ని వాడుకుని రాజకీయంగా బలపడేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ బాగా దూకుడుగా ఉంది. ఎక్కడపడితే అక్కడ టీఆర్ఎస్‌కు చెక్ పెట్టడానికి చూస్తుంది. ఇప్పటికే ఆ పార్టీ ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్‌ని గట్టిగా టార్గెట్ చేసింది. అలాగే నిరుద్యోగుల సమస్యపై కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
పైగా ప్రతి జిల్లాలోనూ బలపడటమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతుంది. ఈ క్రమంలో బీజేపీకి చెక్ పెట్టడానికి, టీఆర్ఎస్ బలం తగ్గకుండా చూసుకోవడానికి కేసీఆర్, కేటీఆర్‌లు ఫీల్డ్‌లో దిగారు. మామూలుగా అయితే కేసీఆర్ పెద్దగా జనంలోకి రారు. కానీ హుజూరాబాద్ ఉపఎన్నిక తర్వాత బయటకొస్తున్నారు. కేసీఆర్ జిల్లాల పర్యటనలు పెట్టుకున్నారు. అటు కేటీఆర్ కూడా అదే పనిలో ఉన్నారు.
ఇక తాజాగా తండ్రికొడుకులు నల్గొండలో పర్యటించారు. ఒకరి తర్వాత ఒకరు నల్గొండ జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభించారు. తాజాగా కేటీఆర్…నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఐటీ హబ్‌కు శంకుస్థాపన చేశారు. 3 వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా దీన్ని నిర్మించనున్నారు. అంటే తమ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందనే కోణాన్ని చూపిస్తున్నారు. ఇటు మంత్రి హరీష్ రావు సైతం ఆయా జిల్లాలు చుట్టుముట్టేస్తున్నారు. ఇలా అందరూ బయటకొచ్చి పనులు చేయాల్సిన పరిస్తితి వచ్చింది. మరి ఇలా బయటకొచ్చిన కేసీఆర్-కేటీఆర్‌లు టీఆర్ఎస్‌పై ఉన్న నెగిటివ్‌ని పోగొడతారో లేదో చూడాలి.