ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. రాష్ట్ర సమస్యలు, పోలవరం ప్రాజెక్ట్ , విభజన హామీలపై ప్రధాన మంత్రితో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. విభజన హామీలపై చర్చిద్దాం అంటూ ఇటీవల తెలంగాణ, ఏపీ సీఎస్ లకు కేంద్రం నుంచి పిలుపు వచ్చింది. ఈక్రమంలో సీఎం జగన్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈనెల 12 తేదీన రెండు తెలుగు రాష్ట్రాల సీఎస్ లను ఢిల్లీకి రావాల్సిందిగా కోరింది.
రేపు ప్రధాని మోదీతో సీఎం భేటీ కానుండటంతో రాష్ట్రంలోని సమస్యలను ప్రధాని దృషికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో కూడా రాష్ట్ర ఎంపీలు పలు సమస్యలను లేవనెత్తారు. విభజన జరిగి 8 ఏళ్లు గడుస్తున్నా పలు సమస్యలు అలాగే ఉన్నాయి. విభజన జరిగిన 10 ఏళ్లలో అన్ని సమస్యలు పరిష్కారం కావాల్సి ఉన్నా… చాలా సమస్యలు అపరిష్కుతంగానే ఉన్నాయి. మరోవైపు విభజన వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయిందని.. ప్రత్యేక హోదా ఇవ్వాలని ఏపీలోని అన్ని పార్టీలు కోరుతున్నాయి. ఈ సమస్యను కూడా ప్రధాన మోదీ దృషికి సీఎం జగన్ మోహన్ రెడ్డి తీసుకెళ్లే అవకాశం ఉంది.