తెలంగాణలో పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే.. మళ్లా పైరవీకారులు పుట్టుకొస్తరు.. కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్టు అవుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. నిర్మల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. రైతుబంధుపై ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్నో రకాలుగా మాట్లాడుతుంది అని కేసీఆర్ పేర్కొన్నారు. రైతుబంధు పుట్టించిందే కేసీఆర్. రైతులు అంతకుముందు ఏడ్చారు. లంచాలు ఇచ్చి ట్రాన్స్‌ఫార్మర్లు రిపేర్ చేయించుకున్న పరిస్థితి.
ఇప్పుడు కరెంట్‌ను ఇచ్చుకున్నాం. నిర్మల్ నియోజకవర్గంలో 15 సబ్ స్టేషన్లు నిర్మించుకున్నారు. వందలాది ట్రాన్స్‌ఫార్మర్లు తెచ్చుకున్నారు. 24 గంటల కరెంట్‌తో పంటలు పండించుకుంటున్నారు అని కేసీఆర్ తెలిపారు. కేసీఆర్ బిచ్చమేస్తుండు అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. రైతులు బిచ్చగాళ్ల లాగా కనబడుతున్నారా..? రైతులు పండించే పంట ఎంత..? అందులో ఆయన తినేది ఎంత..? మిగతాది అంతా దేశానికే కదా ఇచ్చేది. ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ బియ్యం పోతాయి కదా అని కేసీఆర్ తెలిపారు.
పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే.. నేను తెలంగాణ బిడ్డగా చెప్తున్నా.. మీకు చెప్పే బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాను. వాళ్లకు రైతుబంధు మీద ఇష్టం లేదు. కరెంట్ ఇచ్చుడు ఇస్టం లేదు. రైతుల ఖాతాలో డైరెక్ట్‌గా డబ్బులు వేసుడు ఇష్టం లేదు. మళ్లా పైరవీకారులు పుట్టుకొస్తారు. కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్టు అవుతది. జాగ్రత్తా అని మనవి చేస్తున్నా. ఈ అభివృద్ది కొనసాగాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే ఈ అభివృద్ది నిలకడగా ముందుకు పోతది అని అన్నారు.