ఏపీ, తెలంగాణల మధ్య నీటి వివాదం తీవ్ర స్థాయిలో జరుగుతున్న విషయం తెల్సిందే. మొదట నుంచి తెలంగాణ ప్రభుత్వం, ఏపీ నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ మంత్రులు, ఏపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. జగన్(jagan), వైఎస్సార్‌లపై గట్టిగానే విమర్శలు చేశారు.
అయితే ఈ రెండు రాష్ట్రాల సీఎంలు రాజకీయ ప్రయోజనాల కోసమే నీటి యుద్ధాన్ని తెరపైకి తీసుకొచ్చారని రెండు రాష్ట్రాల్లోనే ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని, కానీ వారు ప్రజల్లో భావోద్వేగం వచ్చేలా చేస్తున్నారని మండిపడుతున్నారు. నీటి వివాదాన్ని రెండు ప్రాంతాల మధ్య గొడవలాగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు.
అందుకే ఈ అంశాన్ని సామరస్యంగా పరిష్కరించుకోకుండా మరింత పెద్దది అయ్యేలా చేస్తున్నారని చెబుతున్నారు. ఈ గొడవలోకి ప్రజలని లాగి, రాజకీయంగా బెనిఫిట్ పొందడానికి చూస్తున్నారని, అందుకు ఉదాహరణే తాజాగా ఏపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, తెలంగాణ ప్రాంతం పరిధిలో పులిచింతల ప్రాజెక్టుని పరిశీలించడానికి వెళ్లడమని అంటున్నారు.
అక్కడ తెలంగాణ పోలీసులు అడ్డుకోవడంతో ఎమ్మెల్యే వెనక్కి వెళ్లారని, ఈ అంశంతోనే ఏపీలో ఉన్న ప్రజల భావోద్వేగాన్ని రెచ్చగొట్టేందుకు అక్కడి అధికార పార్టీ ప్రయత్నిస్తుందని విమర్శిస్తున్నారు. కానీ వీరి రచ్చలో ప్రజలు ఎంటర్ అవ్వరని, ప్రజలకు అన్నీ తెలుసని ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి.