జఫర్సన్ మందు కోసమే కేసీఆర్ ఢిల్లీకి పోయిండు – బండి సంజయ్

-

తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్ర నేటి నుంచి ప్రారంభమైంది. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, కిషన్ రెడ్డితో యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి పాదయాత్రని ప్రారంభించారు బండి సంజయ్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణలో బిజెపి ఎక్కడుంది అని అడిగిన వాళ్లకి పాలమూరులో ఎక్కడుందో చూపించామని.. నెక్స్ట్ ఖమ్మంలో కూడా చూపిస్తామన్నారు. జఫర్సన్ స్కాచ్ మందు కోసమే కేసీఆర్ ఢిల్లీకి వెళ్ళాడని ఎద్దేవా చేశారు బండి సంజయ్.

గజేంద్ర సింగ్ షేకావత్ తెలంగాణకు వచ్చే షెడ్యూల్ అనేది మూడు రోజుల ముందే తెలిసిందని.. కానీ కెసిఆర్ షెడ్యూల్ అన్నది మాత్రం ఎవరికీ తెలియదన్నారు. తెలంగాణలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత గోల్కొండ కోటపై కాషాయ జెండాను ఎగరేసి సీఎం ఎవరైనా సరే మొట్టమొదట దర్శించుకునేది పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారినే అని తెలిపారు. ప్రతి బిజెపి కార్యకర్త లక్ష్మీనరసింహస్వామి అవతారం ఎత్తి కేసీఆర్ ను తరిమికొట్టాలన్నారు బండి సంజయ్. యాదాద్రి ఆలయ నిర్మాణం పేరుతో కెసిఆర్ నాణ్యతలేని పనులు చేయించాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడో విడత పాదయాత్ర అంటేనే కెసిఆర్ భయపడుతున్నాడని ఎద్దేవా చేశారు బండి సంజయ్.

గురుకుల పాఠశాలలో పురుగుల అన్నం పెడుతున్నారని.. అదే అన్నం కెసిఆర్ మనవడు తింటాడా? అని ప్రశ్నించారు. ఇక్కడ ఏమీ పీకలేనోడు ఢిల్లీకి పోయి ఏం పీకుతాడు? అంటూ ప్రశ్నించారు. కెసిఆర్ చేతకాని, మూర్ఖపు పాలన వల్లే 2 వేల మంది చేనేత కార్మికులు మరణించారని అన్నారు. మరణించిన చేనేత కార్మికులందరికీ చేనేత బీమా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. యాదాద్రిలో బిజెపి బహిరంగ సభ అనేసరికి చేనేత భీమా అని ప్రకటించారని తెలిపారు. తెలంగాణలో డ్రగ్స్, మాఫియా క్యాసినో అన్నింటిలో టిఆర్ఎస్ నేతల హస్తం ఉందన్నారు. నయీమ్ వ్యవహారంలో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్స్, డబ్బు ఏమైందో కెసిఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

బిజెపి ప్రభుత్వం వచ్చాక ఇవన్నీ కక్కిస్తామన్నారు. కేంద్ర నిధులను దారి మళ్ళిస్తున్న విషయాలను ప్రజలకు చెప్పేందుకే, ప్రజల్లో అవగాహన కల్పించేందుకే మూడవ విడత పాదయాత్ర చేస్తున్నామని తెలిపారు బండి సంజయ్. కల్వకుంట్ల రాజ్యాంగాన్ని బొందపెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తామన్నారు. గడిల్లో బందీ అయిన తెలంగాణ తల్లిని బంధ విముక్తురాలిని చేయాలంటే బిజెపి అధికారంలోకి రావాలన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news