ఖమ్మం టీఆర్ఎస్ లో మళ్లీ రాజుకున్న వర్గపోరు

-

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం లో వర్గ పోరు తీవ్ర రూపం దాలుస్తుంది. అక్కడ నువ్వా నేనా అన్నట్లుగా ఆ ఇద్దరు నేతలు రాజకీయాలు చేస్తున్నారు. కాంగ్రెస్ నుంచి టీఆరెస్ లోకి వచ్చిన ఎమ్మెల్యే పై మాజీ మంత్రి తమ పట్టును నిరూపించుకునేందుకు స్పీడ్ పెంచడంతో ఒక్కసారిగా పాలేరు రాజకీయం వేడెక్కింది.వీరి ప్రయత్నాలు చూస్తుంటే అప్పుడే మళ్లీ ఎన్నికల వస్తున్నాయన్న చర్చ నియోజకవర్గంలో నడుస్తుంది.తాజాగా రైతు సమన్వయ కమిటీలను ఎమ్మెల్యే రద్దు చేయడంతో మాజీ మంత్రి ..ఎమ్మెల్యే వర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో రాజకీయాలు వేడి పుట్టిస్తున్నాయి. రైతు సమన్వయ సమితి కమిటీ లను రద్దు చేసి తన వర్గం వారితో ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి కమిటీ లు వేయడం వివాదానికి ఆజ్యం పోసింది. ఒకవైపు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మరో వైపు ప్రస్తుత ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి నియోజకవర్గాన్ని పర్యటనలతో చుట్టేస్తున్నారు. ఉప్పు నిప్పుగా అధికార పార్టీ లో ఉన్న ఆ నేతలిద్దరూ నియోజకవర్గం లో చనిపోయిన కుటుంబాలను పెళ్లిళ్లు పేరంటాలు, భారసాలలు ఏ ఒక్కటి కూడా వదిలి పెట్టకుండా అన్నిటిని కవర్ చేస్తున్నారు.

ఓటమి తర్వాత సైలెంట్ అయిన తుమ్మల సైతం గత కొద్ది రోజులుగా స్పీడు పెంచారు.నియోజకవర్గంలో అందరికీ అందుబాటు ఉంటూ ప్రతి ఇంటికి వెళ్లి కలుస్తున్నాడు. మంత్రి గా ఉన్న సమయంలో కంటే ఇప్పుడు ఎక్కువగా కార్యకర్తల కోసం తుమ్మల సమయాన్ని కేటాయిస్తున్నారట. ఇదే సమయంలో గతంలో వేసిన రైతు సమన్వయ కమిటీ లను రద్దు చేసి తన వర్గం తో కందాల నింపేశాడు. ఇదే ఇప్పుడు నియోజకవర్గం లో రచ్చకు కారణమైంది. గతంలో గుత్తా సుఖేందర్ రెడ్డి రైతు సమన్వయ సమితి చైర్మన్ గా ఉన్నప్పుడు మండల స్థాయిలో కమిటీలను వేయటం జరిగింది. రాష్ట్రం లో ఇప్పటికి అవే కమిటీ లను కొనసాగిస్తున్నారు. ఆ కమిటీని ఇప్పటివరకు కొత్తగా చైర్మన్ గా వచ్చిన పల్లా రాజేశ్వర్ రెడ్డి రద్దు చేయలేదు. కొత్తవి ఏర్పాటు చేయలేదు.

2017లో వేసిన కమిటీలలో తుమ్మల వర్గం వారే ఎక్కువ ఉన్నారు.. వాటిని రద్దు చేసి తన వర్గం వారిని నింపడానికి కందాల వర్గం గత ఆరు నెలల నుంచి కసరత్తులు చేసిందట. దీంతో నియోజకవర్గంలో ఉన్న గ్రామ కమిటీలు మండల కమిటీలు రద్దు చేస్తూ కొత్త కమిటీ లను ఎమ్మెల్యే తీసుకొచ్చారు. కొత్త కమిటీ పై తుమ్మల వర్గం భగ్గుమంటుంది. కాంగ్రెస్ నుంచి వచ్చిన కందాల ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ వారితో రైతు సమన్వయ కమిటీలు నింపేస్తున్నారని ఇది టిఆర్ఎస్ పార్టీకి నష్టం వాటిల్లుతుందని ఆరోపిస్తున్నారు.

కొసమెరుపు ఏంటంటే గ్రామస్థాయిలో వంద కమిటీలు మండల స్థాయిలో ఉన్న నాలుగు కమిటీలు రద్దయ్యాయి. కొత్త కమిటీలు వేశారు…. అయితే ప్రతి కమిటీ లో 15 మంది ఉండగా.. వారందరూ ఇప్పుడు తుమ్మల వర్గంగా ముద్ర పడేశారు.. ఈ కమిటీ లన్ని రద్దు చేయడంతో అనూహ్యంగా తుమ్మలకు కలిసొచ్చిందట.తుమ్మల వర్గం అని కమిటి లను రద్దు చేయడం ద్వారా వీరంతా ఇప్పుడు తుమ్మల వర్గంగా ముద్రపడ్డారు. ఆ కమిటీలలో ఉన్న వాళ్ళు సైతం పెద్దగా తుమ్మలను పట్టించుకోలేదు కానీ ఇప్పుడు మాత్రం తుమ్మల బ్రాండ్ గా మారిపోవాల్సి వచ్చింది. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశంతో ఏ పదవి లేకున్నా జిల్లాతో పాటు అన్ని మండలాల్లో పర్యటిస్తున్నారు మాజీ మంత్రి తుమ్మల.

రైతు కమిటీల రద్దుతో తుమ్మల వర్గీయులు రోడ్డెక్కి రసాబస చేస్తున్నారు. నియోజక వర్గంలో ఇప్పుడు టిఆర్ఎస్ లో ఇద్దరూ నేతలు వర్గాలను బలోపేతం చేసుకోవడం పార్టీకి చేటు తెస్తుందన్న ఆందోళన లో కార్యకర్తలు ఉన్నారట.

Read more RELATED
Recommended to you

Latest news