ఒకప్పుడు అంటే రాజులు, రాజ్యాలు ఉండేవి. ఇప్పుడు అన్నీ పోయాయ్. కానీ రాజులు అలవాట్లు, వారి పద్దతులు చరిత్రపుటల్లో ఎక్కడో ఒకదగ్గర చెప్పబడుతూనే ఉన్నాయి. ఒక్కోరాజుకు ఒక్కో వింత ఆహార అలావాట్లు ఉండేవి. వారి జీవినశైలి, విలాసాలు,అలవాట్లు మనకు ఒకింత ఆశ్యర్యాన్ని కలిగిస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకునే రాజు గురించి మీకు కూడా ఆశ్యర్యపడకతప్పదు. ఒకప్పటి గుజరాత్ చక్రవర్తి…మహమూద్ బెగాడ ఆహార అలవాట్ల గురించి చూద్దాం. ఆయన గొప్ప ఆహారప్రియుడు. ఎంతలా అంటే.. ఒక్కరోజులో 35 కిలోల అన్నాన్ని తినేసేవాడట.
మహారాజు మహమూద్ బెగాడ అసలు పేరు మహమూద్ షా 1458-1511 మధ్య గుజరాత్‌ను పరిపాలించారు. కేవలం 13ఏళ్ల వయసులో సింహాసనం పగ్గాలు అందుకున్న మహమూద్ బెగాడ 53 సంవత్సరాలు పాలించిన రాజుల్లో ఒకడిగా నిలిచాడు. శారీరకంగా ఎంతో దృఢంగా ఉండే ఈ రాజు.. ఆహారాన్ని చూస్తే ఆగలేకపోయేవాడట. ప్రతి రోజు భోజనంతోపాటు ఏదో ఒకటి తింటూనే ఉండేవాడట.. ఎంత తిన్నా ఆయనకు సులభంగా అరిగిపోవడం ఆయనకు బాగా కలిసొచ్చింది.
ఉదయాన్నే అల్పహారంగా ఒక గిన్నె నిండా తేనె, మరో గిన్నె నిండా వెన్న లాగించేసి..ఆ తర్వాత 100 నుంచి 150 వరకు అరటిపండ్లు తినేవాడట. మధ్యాహ్నం.. రాత్రి భోజనంలో కిలోల కొద్ది ఆహారం తినేవాడని చరిత్రకారులు తెలిపారు. అంత తిన్న తర్వాత కూడా ఆకలి వేసినట్టు అనిపిస్తే.. కనీసం 4.5కిలోల పరమాన్నం లేదా తీపి పదార్థాలను తినేవాడట. అయినా.. రాత్రుళ్లు ఆయనకు ఆకలేసేదట. అందుకే అంతఃపుర సిబ్బంది ఆయన పడుకునే మంచం ఇరువైపులా మాంసంతో చేసిన సమోసాలను పెట్టేవారట. తిండిబోతు రాజులా ఉన్నాడుకదా..నిజమేగా.!
విషము కూడా తినేవాడట
యూరోపియన్ చరిత్రకారులు చెప్పిన ప్రకారం.. ఓ సారి శత్రువులు మహమూద్‌పై విష ప్రయోగం చేసేందుకు ప్రయత్నించారట. దాని నుంచి తప్పించుకున్న ఆయన.. ఆ తర్వాత విషం తిన్న ఏమీ కాకుండా శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచుకోవాలని నిర్ణయించుకున్నాడు. ప్రతి రోజు తక్కువ మొత్తంలో విషం తీసుకునేవాడట. రోజు విషం తీసుకుంటుండటంతో ఆయన విప్పేసిన దుస్తుల్ని ఎవరూ ముట్టుకునేవాళ్లు కాదు. దుస్తులు కూడా విషపూరితమవుతాయని వాటిని కాల్చేసేవారు. అలా మహమూద్ బెగాడ ఆహారపు అలవాట్లు చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయాయి.