రాష్ట్రంలో దళిత బంధే కాదు.. బీసీ,మైనారిటీ, గిరిజన బంధులను కూడా తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. మేం ఏం అడ్డుకోం వీటిని అమలు చేస్తే స్వాగతిస్తాం అని అన్నారు. ప్రతీ గ్రామంలో బీజేపీ కార్యకర్తలు దళిత బంధు కోసం వాలంటరీగా పనిచేస్తారన్నారు. ధాన్యం కొనుగోలుపై మరోసారి కిషన్ రెడ్డి మాట్లాడారు. 2014-15లో వరిధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్రం రూ. 3404 కోట్లు కేటాయిస్తే.. 2020-21 లో కేంద్రం రూ. 26641 కోట్లను కేటాయించిందని తెలిపారు. రైతుల నుంచి సేకరించే ధాన్యానికి కేంద్రమే డబ్బులు చెల్లిస్తుందని మరోమారు స్పష్టం చేశారు. ఇంతలా రైతుల ప్రయోజనాలకు కేంద్రం ఖర్చు పెడుతుంటే… ఏం చేయడం లేదనడానికి టీఆర్ఎస్ పార్టీకి నోరెలా వచ్చిందన్నారు. తెలంగాణ రైతులు కేవలం ధాన్యాన్ని మాత్రమే పండిస్తారని, మిల్లర్లు రా రైస్, బాయిల్డ్ రైస్ గా మారుస్తున్నాయన్నారు. మేం ’రా‘ కొనేందుకు సిద్ధంగా ఉన్నామని మరోసారి స్పష్టం చేశారు. హుజూరాబాద్ ప్రజల మీద ధర్నాలు చేస్తున్నారా..? హుజూరాబాద్ లో ఓడిపోయినందుకు ధర్నాలు చేస్తున్నారా..? అని ప్రశ్నించారు. ధర్నా చౌక్ వద్దన్న వాళ్లే అక్కడ ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు.
అబద్దాల సామ్రాజ్యం మీద ప్రభుత్వాన్ని నడపకండి…అని కిషన్ రెడ్డి అన్నారు. మేం ఎక్కడా అప్పులు చేసి కమీషన్లు తీసుకోలేదని టీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి విమర్శించారు. రామప్పకు యునెస్కో గుర్తింపు రావడానికి రాష్ట్రమే ప్రయత్నించిందా..? కేంద్రం ఏమీ చేయలేదా…? మీరే ప్రపంచ దేశాల నేతలతో మాట్లాడి గుర్తింపు తెచ్చుకున్నారా.. ? 19 దేశాలను ఒప్పించింది రాష్ట్ర ప్రభుత్వమేనా..? అని వ్యంగ్యంగా ప్రశ్నించారు.