హుజూరాబాద్ లో బీజేపీ ఎలా గెలిచిందో అందరి తెలుసని, బీజేపీతో కలిసినందుకే కాంగ్రెస్ పార్టీలో గొడవలు చెలరేగుతున్నాయని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బీజేపీ కాంగ్రెస్ కలిసి పోవడం వల్లే హుజూరాబాద్ లో ఈటెల రాజేందర్ గెలిచారని విమర్శించారు. దీంతోనే కాంగ్రెస్ సీనియర్లు ఆపార్టీ అధ్యక్షుడిపై విమర్శలు చేస్తున్నారన్నారు. హుజూరాబాద్ లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని కొప్పుల అన్నారు. తమ ఓటు బ్యాంకు ఎక్కడికపోలేదని తెలిపారు.
దళిత బంధు హుజూరాబాద్ లో అమలు చేసి తీరుతాం అన్నారు. ఈసీకి ఫిర్యాదు చేసి హుజూరాబాద్ లో దళితబంధు ఆపింది బీజేపీ కాదా..అని ప్రశ్నించారు. బీజేపీ పాలిత ప్రాంతాల్లో దళితబంధును అమలు చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రజల కోసం పనిచేస్తే ..బీజేపీ కార్పోరేట్లు, అదానీ, అంబానీల కోసం పనిచేస్తుందని ఎద్దేవా చేశారు. బండి సంజయ్ కు దమ్ముటే కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని సవాల్ విసిరారు. దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టారని కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. హుజూరాబాద్ ఫలితాలపై సమీక్షించుకుంటామని, పార్టీలో చర్చిస్తామని ఆయన అన్నారు. ఈటెల అహంతో రాష్ట్ర నేతల మాట్లాడుతున్నారని.. బీజేపీలో వ్యక్తిగత ఎజెండాలు ఉండవని, ఉమ్మడి ఎజెండా మాత్రమే ఉంటుందని అన్నారు.