కెసిఆర్ గారు రైతు వ్యతిరేకి అనడం పైన అమిత్ షా పై మండిపడ్డారు మంత్రి కేటీఆర్. కేంద్ర మంత్రి అమిత్ షా కెసిఆర్ గారిని రైతు వ్యతిరేకి అనడం ఈ శతాబ్దపు జోక్ అంటూ నిప్పులు చెరిగారు. ఒకవైపు కేసీఆర్ గారి ఆలోచన విధానాల నుంచి రూపొందిన రైతుబంధు వంటి కార్యక్రమాలను మక్కీకి మక్కీగా కాపీ కొట్టి పిఎం కిసాన్ గా పేరు మార్చిన కేంద్ర ప్రభుత్వం ఎవరిది అని ప్రశ్నించారు మంత్రి కేటీఆర్.
రైతు వ్యతిరేక నల్ల వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చి 700 మంది రైతుల ప్రాణాలను బలిగొన్న తర్వాత…. దేశ రైతాంగం యొక్క తీవ్ర వ్యతిరేకత వలన క్షమాపణ చెప్పిన వారెవరని నిలదీశారు.కేంద్ర ప్రభుత్వం యొక్క ఫసల్ బీమా యోజన లో చేరలేదని కెసిఆర్ గారిని విమర్శిస్తున్న అమిత్ షా, మరి గుజరాత్ ప్రభుత్వం అదే పథకాన్ని ఎందుకు తిరస్కరించిందో, అదే పథకం నుంచి ఎందుకు వైదొలిగిందో చెప్పాలన్న కేటీఆర్.. మీ సొంత రాష్ట్రం గుజరాత్ లోని రైతంగానికి ఎలాంటి ప్రయోజనం కలిగించని ఈ పథకం తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా లబ్ధి చేకూరుస్తుందో చెప్పాలని నిలదీశారు. ఇప్పటికైనా అర్థరహితమైన హిపోక్రసీని అమిత్ షా వదిలిపెట్టాలని కేటీఆర్ సూచనలు చేశారు