రాజ్ భవన్, తెలంగాణ ప్రభుత్వానికి గ్యాప్ స్పష్టంగా తెలుస్తోంది. ఢిల్లీకి వెళ్లిన గవర్నర్ తమిళిసై నిన్న ప్రధాని మోదీని కలిసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ కార్యాలయాన్ని, గవర్నర్ ను తెలంగాణ ప్రభుత్వం అవమానపరుస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రోటోకాల్ పాటించడం లేదని ఆమె ఆరోపించారు. ఇదిలా ఉంటే ఈరోజు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో గవర్నర్ భేటీ అయ్యారు. తెలంగాణలో గవర్నర్ రోడ్డు మార్గానే ప్రయాణించాల్సి వస్తోందని…తనకు హెలికాప్టర్ సదుపాయం ఇవ్వడం లేదనే ఉద్దేశ్యంతో ఆమె వ్యాఖ్యానించారు. యాదాద్రి కార్యక్రమానికి తాను బీజేపీ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా వెళ్లానంటూ కొంతమంది విమర్శించడాన్ని తప్పుపట్టారు.
ఇదిలా ఉంటే తమిళి సై చేసిన ఈ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. గవర్నర్ కు మాకు ఎలాంటి పంచాయతీ లేదని ఆయన అన్నారు. తనకు తానే ఏదో ఊహించుకుని మాట్లాడితే మేం ఏం చేయాలి అంటూ ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ విషయంలో గవర్నర్ తమను ఇబ్బంది పెట్టారని… ఇప్పుడు మేం ఇబ్బంది పెడుతున్నారని అన్నారట అంటూ … గతంలో నరసింహన్ గవర్నర్ గా ఉన్నప్పుడు మాకు ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదని కేటీఆర్ అన్నారు. గవర్నర్ కాకముందు తమిళిసై ఏ పార్టీకి చెందిన వారో అందరికీ తెలుసు అంటూ వ్యాఖ్యానించారు.