ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటం చేద్దామంటూ ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఈ సందర్భంగా ఆమె విపక్షాలకు లేఖ రాశారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కోసం ఉమ్మడి పోరాటం చేద్దామని లేఖలో పేర్కొన్నారు. ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలుద్దామని లేఖలో పేర్కొన్నారు వైయస్ షర్మిల. పాలనలోని వైఫల్యాలు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అంతకంతకు దిగదార్చుతోందని విమర్శించారు.
విపక్షాలు ఒకటై ముందుకు అడుగు వేయాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. రాక్షసత్వంతో పోలీసులను పోరిగొల్పి, వారిపై ఒత్తిడి తెచ్చి మరీ థర్డ్ డిగ్రీలు ఉపయోగిస్తూ ఆసుపత్రిపాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల వద్దకు వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్నారని లేఖలో పేర్కొన్నారు. ఆంధ్ర పాలకుల హయాంలోనూ ఈ ఘటనలు చోటు చేసుకోలేదని, తెలంగాణలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులను నేపథ్యంలో రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.