కేంద్ర ప్రభుత్వం మరో సంచల నిర్ణయం అమలు చేయనుంది. ఇప్పటివరకు ఎన్ని కఠినమైన నిబంధనలు తీసుకువచ్చినా రోడ్డు ప్రమాదాల్లో మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. అయితే గతంలో హెల్మెట్ తప్పనిసరి అంటూ నిబంధనలు తీసుకువచ్చినా లాభం లేకుండా పోయింది. ప్రజలు లోకల్‌గా తయారుచేసే నాణ్యతలేని చవక హెల్మెట్లను వాడుతూ చలాన్లను తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అవి తక్కువ ధర కావడంతో వాటి వైపుకు మొగ్గు చూపుతున్నారు. అయితే నాణ్యతలేని హెల్మెట్లు ప్రమాద సమయంలో ధ్వంసమవుతుండడంతో వాహనదారుల తలకు గాయాలవుతున్న ఘటనలు ఈ మద్యకాలంలో ఎక్కువగా జరుగుతున్నాయి. స్థానికంగా తయారు చేసిన హెల్మెట్ల వల్ల, రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్ లేకుండా ప్రతిరోజూ 28 మంది ద్విచక్రవాహనదారులు చనిపోతున్నారని గణాంకాలు చూస్తే అర్థమవుతుంది.
ఇక కేంద్రం హెల్మెట్ల విషయంలో కొత్త నిబంధనలను అమలు చేయబోతుంది. ఈ నిబంధనలు అమలులోకి వస్తే.. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా బీఎస్‌ఐ మార్గదర్శకాలతో రూపొందించిన హెల్మెట్లు మాత్రమే వాడాల్సి ఉంటుంది. ఒకవేళ లోకల్ హెల్మెట్లు వాడితే రూ.1వేయి జరిమానా విధించబడుతుంది. అలాగే స్థానికంగా ఎవరైనా హెల్మెట్లు తయారు చేసినట్లైతే రూ.1లక్ష జరిమానాతో పాటు జైలు శిక్ష విధిస్తారు.
ద్విచక్రవాహనదారుల రక్షణ కోసం రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలను రూపొందించింది. జూలై 30న విడుదల చేసిన నోటిఫికేషన్‌లో మంత్రిత్వ శాఖ వాహనదారుల నుండి అభ్యంతరాలు, సలహాలను కోరింది. రానున్న 30 రోజుల్లో ఈ నిబంధన అమలులోకి రానుంది. కొత్త నిబంధన అమలులోకి వచ్చిన తరువాత, హెల్మెట్ తయారీ సంస్థలు బీఎస్ఐ సర్టిఫైడ్ హెల్మెట్లను మాత్రమే తయారు చేసి అమ్మాలి.
కొత్త నిబంధనల ప్రకారం హెల్మెట్ బరువును ఒకటిన్నర కిలోల నుండి ఒక కిలో 200 గ్రాములకు తగ్గించారు.