ఎట్టకేలకు ఏపీలో ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఊహించని ట్విస్ట్‌ల మధ్య వాయిదా పడుతూ వస్తున్న స్థానిక పోరు ఫలితాలపై ఉత్కంఠ తొలగిపోయింది. ఇక ఈ ఫలితాల్లో వైసీపీ హవా స్పష్టంగా కనబడుతోంది. ఇప్పటికే పంచాయితీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లు అనే తేడా లేకుండా వైసీపీ ప్రభంజనం కొనసాగింది. ఆ ఎన్నికల్లో వైసీపీకి వన్‌సైడ్‌గా విజయాలు దక్కాయి…టిడిపి ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయింది.
అయితే 2020 కోవిడ్‌కు ముందే ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పుడు ఎస్‌ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్…ఆ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి, నామినేషన్స్ కూడా తీసుకున్నారు. కానీ కోవిడ్ నేపథ్యంలో అప్పుడు వాయిదా పడ్డాయి. ఇక 2021లో నిమ్మగడ్డ…పంచాయితీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించి రిటైర్ అయిపోయారు. దీంతో ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికలని కొత్తగా ఎస్‌ఈసిగా నియమించబడ్డ నీలం సాహ్ని నిర్వహించారు.
అయితే ముందే నామినేషన్స్ వేసి ఉన్నా సరే, చంద్రబాబు గెలవడం కష్టమని భావించి, ఎంపిటిసి, జెడ్‌పిటిసి ఎన్నికలని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. కానీ తెలుగు తమ్ముళ్ళు మాత్రం తాము పోటీలో దిగుతామని చెప్పి మరీ, పోటీ చేశారు. కానీ ఈ ఎన్నికలు చెల్లవంటూ ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్ళాయి. ఈ క్రమంలో ఒకసారి ఎన్నికలని రద్దు చేయాలని తీర్పు రాగా, మరొకసారి ఫలితాలని పెండింగ్‌లో పెట్టాలని తీర్పు వచ్చింది. అయితే చివరికి హైకోర్టు తాజాగా ఫలితాలు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
తాజాగా 7,219 ఎంపీటీసీ.. 515 జెడ్పీటీసీ స్థానాలకు వెలువడుతున్న ఫలితాల్లో వైసీపీ వన్‌సైడ్‌గా విజయాలు సాధిస్తుంది. ఇక అప్పుడేమో పోటీ చేసి, ఇప్పుడు రిజల్ట్స్ వ్యతిరేకంగా వస్తుండటంతో…తాము ఎన్నికలు బహిష్కరించామని, ఈ రిజల్ట్ ఎలా వచ్చిన తమకు ఏమి ఇబ్బంది లేదన్నట్లు తమ్ముళ్ళు తప్పించుకుంటున్నారు. ఏదేమైనా ఈ రిజల్ట్ ద్వారా ప్రజల మద్ధతు మళ్ళీ జగన్‌కే ఎక్కువ ఉందని అర్ధమవుతుంది.