బండి సంజయ్ అరెస్ట్ ఘటనపై పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. అరెస్ట్ చేసిన విధానాన్ని తీవ్రంగా పరిగణించింది. ఇటీవల తనను అరెస్ట్ చేసిన విధానంపై, ఎంపీగా తన హక్కులకు భంగం కలిగించిన విధానంపై పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి బండి సంజయ్ ఫిర్యాదు చేశారు. దీంతో తాజాగా ప్రివిలేజ్ కమిటీ తెలంగాణ సీఎస్, డీజీపీ, హోంకార్యదర్శి, కరీంనగర్ సీపీతో పాటు ఘటనకు కారణమైన పోలీస్ అధికారులకు సమన్లు జారీ చేశారు కమిటీ చైర్మన్ సునీల్ కుమార్. ఫిబ్రవరి 3న కమిటీ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది.
ఈనెల 4న ఉపాధ్యాయుల బదిలీ, 317 జీవో పై నిరసన తెలిపేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ జాగరణ దీక్ష చేపట్టారు. కరీంనగర్ లోని తన కార్యాయలంలో దీక్షకు కూర్చున్న సమయంలో కరీంనగర్ సీపీతో పాటు పోలీసులు బండి సంజయ్ ని అరెస్ట్ చేశారు. కోవిడ్ రూల్స్ ను ఉల్లంఘించిన కారణంగా పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత కరీంనగర్ కోర్ట్ సంజయ్ కు జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. అయితే హై కోర్ట్ బండి సంజయ్ ని విడుదల చేయాల్సిందిగా ఆదేశించింది. అయితే తనని అక్రమంగా, ఎంపీగా తన హక్కులని హరించేలా అరెస్ట్ చేశారని బండి సంజయ్ పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు.