ఏపీలో నారా లోకేష్ యువగళం పేరిట పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. జనవరి 27వ తేదీ నుంచి లోకేష్ పాదయాత్ర మొదలుపెట్టి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. పాదయాత్ర మొదటి రోజు కాస్త హైలైట్ అయిన విషయం తెలిసిందే. కానీ ఆ తర్వాత నుంచి లోకేష్ పాదయాత్ర గురించి పెద్దగా చర్చ జరగడం లేదు. ఏదో పాదయాత్ర జరిగే చోట స్థానికంగా మాత్రం చర్చ నడుస్తోంది.
రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం లోకేష్ పాదయాత్ర పెద్దగా హైలైట్ కావడం లేదు..ఇటు మీడియాలో కూడా ఎక్కువగా పాదయాత్ర అంశాలు కనిపించడం లేదు. ఏదో టిడిపి అనుకూల మీడియాలో కాస్త కనిపిస్తుంది గాని..వైసీపీ అనుకూల మీడియా మాత్రం లోకేష్ పాదయాత్రని పట్టించుకోవడం లేదు. దీని బట్టి చూస్తే ఏదో నార్మల్ గానే లోకేష్ పాదయాత్ర ముందుకెళుతుంది. పెద్దగా సంచలనాలు నమోదు కావడం లేదు. ఈ క్రమంలోనే లోకేష్ రూట్ మర్చినట్లు కనిపిస్తున్నారు. తెలంగాణలో షర్మిల పాదయాత్ర చేస్తూ..ఈ తరహాలో అధికార ఎమ్మెల్యేపై తీవ్ర అవినీతి ఆరోపణలు చేస్తున్నారో తెలిసిందే.
ఏ నియోజకవర్గంలో పర్యటిస్తే..అక్కడ స్థానిక ఎమ్మెల్యేని గాని, మంత్రిని గాని టార్గెట్ చేసి షర్మిల తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని విరుచుకుపడుతున్నారు. దీంతో రివర్స్ లో కౌంటర్లు సైతం వస్తున్నాయి. అప్పుడు షర్మిల పాదయాత్ర హైలైట్ అవుతుంది.
అదే తరహాలో ఇప్పుడు లోకేష్ సైతం స్థానిక ఎమ్మెల్యేలపై ఫోకస్ పెట్టారు. తాజాగా చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈయన భూ దోపిడీకి అంతు లేదని విరుచుకుపడ్డారు. ఆఖరికి సిఎం రిలీఫ్ ఫండ్, వరద నిధుల్లో 20 శాతం వాటా కొట్టేస్తున్నారని ఫైర్ అయ్యారు. అటు మంత్రి పెద్దిరెడ్డి అయితే..భూ దోపిడి, అక్రమ ఇసుక, గ్రానైట్..ఇలా ఆయన దోపిడీకి అంతు లేదని ఆరోపించారు. ఇలా స్థానిక ఎమ్మెల్యేలు, మంత్రులని టార్గెట్ చేస్తూ లోకేష్ ముందుకెళుతూ..తన పాదయాత్రకు హైప్ తెచ్చుకుంటున్నారు.