అనూహ్యంగా సీటు దక్కింది ఆ పై ఎమ్మెల్యేగా విజయం సాధించారు. గెలిచిన తర్వాత నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేశారట. వ్యక్తిగత పంతాలకు మాత్రం ఎక్కడ లేని ప్రాధాన్యత ఇస్తున్నారట. చిత్తూరు జిల్లా మదనపల్లి ఎమ్మెల్యే నవాజ్ బాషా వైఖరి ఇటు వైసీపీ కేడర్‌ను, అటు నియోజకవర్గ ప్రజలకు మింగుడుపడటం లేదు.
గత ఎన్నికలలో మాజీ ఎమ్మెల్యే తిప్పారెడ్డిని వివిధ సామాజిక సమీకరణాల కారణంగా పక్కనబెట్టారు వైసీపీ అధినేత సీఎం జగన్. కనీసం వైసీపీలో సభ్యత్వం కూడా లేని నవాజ్ బాషాకు టికెట్ ఇచ్చారు. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా తమ్ముడే ఈయన. కేవలం 20 రోజుల్లోనే ఎమ్మెల్యేగా విజయం సాధించినప్పటి నుంచి ఇప్పటి వరకూ నవాజ్ బాషా వ్యవహార శైలి ఎవరికీ అర్థంకాని విధంగా ఉందని అధికార పార్టీ వర్గాలే కామెంట్స్ చేస్తున్నాయి.
కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలకే ప్రాధాన్యం ఇస్తున్నారట ఎమ్మెల్యే. ఆయనకు అభివృద్ధి అనే పదం వినపడటం లేదని అంటున్నారు స్థానికులు. మదనపల్లె పట్టణానికి తాగునీటి సమస్య తీవ్రస్థాయిలో ఉన్నా.. కృష్ణా జలాలను తీసుకురావడంలో విఫలమయ్యారని.. హంద్రీనీవా కాలువ ద్వారా పుంగనూరు నియోజకవర్గంలోని సమ్మర్ స్టోరేజీ ట్యాంక్‌కు తరలిపోతున్నా పెదవి విప్పడం లేదని అంటున్నారు. ఆసియాలోనే అతిపెద్దదైన మదనపల్లె టమాట మార్కెట్‌కు వచ్చే రైతుల ఇబ్బందులు పరిష్కరించడం లేదని టాక్. ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండటమే గగనమనే చర్చ జోరందుకుంది.
నవాజ్ బాషా ఎమ్మెల్యేగా గెలిచి 20 నెలలు దాటిపోయింది. ఈ సమయంలో మాజీ ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి వర్గానికి చెందిన వారిని పక్కన పెట్టడానికి.. టీడీపీ కేడర్‌ను వైసీపీలో చేర్చుకోవడానికి ప్రాధాన్యం ఇచ్చారట. ముందు నుంచీ వైసీపీలో ఉంటున్న వారికి ఎమ్మెల్యే వ్యవహారశైలి కడుపుమండిస్తోందట. అలాగే తన అన్న మాజీ ఎమ్మెల్యే షాజహాన్ బాషాపై కక్ష తీర్చుకోవడానికే ఎమ్మెల్యే ఎక్కువ సమయం కేటాయించారని అనుకుంటున్నారు.
షాజహాన్ హయాంలో టిప్పుసుల్తాన్ మైదానంలో ముస్లింలకు అద్దె ప్రాతిపదికన దుకాణాల ఏర్పాటుకు స్థలం ఇప్పించారు. స్థానిక జామియా మసీదుకు ఆ అద్దె చెల్లించాలి. అయితే అన్నకు పేరు వస్తుందనో మరేదో కారణమో కానీ మైదానంలోని దుకాణాలను, ఇళ్లను ఎమ్మెల్యే నవాజ్ బాషా తొలగించారనే ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే వ్యవహారాలపై మదనపల్లెకు చెందిన కొందరు పార్టీ నేతలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారట.
అయితే ఈ విషయంలో ఎమ్మెల్యే వాదన మరోలా ఉంది. మదనపల్లెలో ఏ అభివృద్ధి పని చేయాలన్న వైసీపీ సీనియర్ నేతలు అడ్డువస్తున్నారని అనుచరుల దగ్గర చెప్పుకొని వాపోతున్నారట ఎమ్మెల్యే. ఎమ్మెల్యే మాటలను విశ్వసించాలో.. నియోజకవర్గంలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మాలో అర్థం కావడం లేదని పార్టీ కేడర్ జట్టుపీక్కుంటోందట.