వాగర్థావివ సంపఋక్తౌ వాగర్థ ప్రతిపత్తయే
జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ!!
వాక్కు, అర్థం ఎలా విడదీయరానివో ప్రకఋతి దానిలో ఆదఋశ్యంగా అవ్యక్తంగా ఉండేది అర్థమనే పురుషుడు. జగత్తుకు తల్లితండ్రులు పార్వతీ పరమేశ్వరులు. జగత్తుకు తండ్రి శంకరుడు. శివ అంటే శాశ్వతం, మంగళం, శుభం. శివా అంటే అమ్మవారు. శివశివా అంటే శివపార్వతీలుగా చెప్పవచ్చు.
ఏడాదిలో వచ్చే పన్నెండు శివరాత్రుల్లో పదకొండవదైన మాఘమాసంలోని శివరాత్రినే మహాశివరాత్రిగా జరుపుకొంటారు. ఈరోజు శివుడు లింగరూపం ఆవిర్భవించినదిగా చెప్తారు. కానీ పురాణాల్లో మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం నాడు ఆవిర్భవించిన శివలింగాన్ని బ్రహ్మ, విష్ణువులు ఆది,అంతం తెలుసుకోవడానికి బ్రహ్మ ఊర్థ ముఖంగా, విష్ణువు వరాహ అవతారంలో అథోముఖంగా ప్రయాణిస్తారు. కానీ ఎంతకు ఆది, అంతం కన్పించవు. చివరకు మాఘమాస శివరాత్రి రోజున ఇద్దరు ప్రయాణం ప్రారంభించిన స్థలానికి వచ్చి ఆ పరమేశ్వరున్ని ప్రార్థిస్తారు. ఆ సమయంలో జ్యోతిస్ఫాటిక లింగంగా ఆవిర్భవించి పరమేశ్వరుడు వారికి దర్శనమిస్తాడు. ఈ కాలాన్నే మహాశివరాత్రిగా, లింగోద్భవకాలంగా పేర్కొంటారు. ఈ సమయంలో చేసే అర్చనలు, అభిషేకాలకు ఫలం రెట్టింపు. ఈ జ్యోతిస్ఫాటిక లింగం ఆవిర్భవించిన రోజు మహాశివరాత్రి. ఈ రోజున ఎవరైతే శ్రద్ధతో, భక్తితో శివారాధన చేస్తారో వారికి ఇక జన్మ ఉండదు అని, ఇహలోకమలో వారికి సర్వసౌఖ్యాలు లభిస్తాయని ప్రతీతి.
శివరాత్రినాడు ఏం చేయాలి?
– శివరాత్రి అంటే అన్ని పండుగల కంటే ప్రత్యేకమైంది. ఒక్కసారి సూక్ష్మంగా పరిశీలిద్దాం.. అన్ని పండుగలకు కొత్త దుస్తులు, పిండి వంటలు, షడ్రోసోపేతమైన ఆహారాలు, విందులు, వినోదాలు ఇలా పండుగలను నిర్వహించుకుంటాం. కానీ ఏవైతే మానవ జన్మలో తాత్కాలిక ఆనందాన్ని ఇచ్చి మల్లీ సంసారభ్రమణం (సంసారం అంటే జనన, మరణ చక్రం)లో పడవేస్తాయే వాటినే ఇష్టపడుతారు. కానీ భోగం, భోజనం, నిద్ర అంటే తమో, రజో, సత్వగుణాలకు అతీతంగా సర్వం శివమయంగా భావించడు. ఈ త్రిగుణాల పుట్టుక స్థానం లింగం. (లింగం అంటే గుర్తు అని అర్థం). ఇవి లయం అయ్యేది ఆ లింగంలోనే కాబట్టి లయనాల్లింగమితిత్యుక్తం అని శివపురాణం చెప్తుంది. లోకమే లింగమయం. 364 రోజులు మన ఇహలోక విషయాల కోసం అర్పించినా కనీసం ఒక్క శివరాత్రి రోజైనా వీటన్నింటికి దూరంగా పరమాత్వతత్వం తెలుసుకుని జన్మను తరింప చేసుకోవడమే శివరాత్రి పరమార్థిక. అసలు మనం ఎక్కడి నుంచి వచ్చాం. ఎందుకు వచ్చాం. ఏం చేయాలి. జన్మంటే ఇతర జీవరాశిలాగా జాయత్తే గచ్ఛతే అనేది కాదు అని జ్ఞానమున్న మనుష్యుడు వీటన్నింటకంటే భిన్నంగా పరమాత్వ తత్వాన్ని తెలుసుకోవాలన్నది శివరాత్రిలోని గూడార్థం.
ప్రధానంగా శివరాత్రినాడు నాలుగు పనులు చేయాలి అవి…
1. ఉపవాసం
2. అభిషేకం
3. బిల్వపత్రార్చన
4. జాగరణ
ఉపవాసంః భగవంతునికి దగ్గరగా ఉండటమే. అంటే ఈ రోజున ఎవరైతే తమ మనస్సును పూర్ణంగా శివారాధనవైపు మళ్లించడమే. మానవుడు తను నిత్యం చేసే పనలు చేసుకుంటూనే మనస్సును వేరేవాటివైపు పోనియకుండా ఆ శివతత్వాన్ని తెలుసుకోవడమే ఉపవాసం.
ఉపవాస దీక్షలో ఏం తినాలి?
– శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నవారు శివరాత్రి తెల్లవారుఝామునే లేసి తలస్నానం చేసి స్వామి ఆరాధన ప్రారంభించాలి. ఆరోజు ఉడకబెట్టిన పదార్థాలు ఏవి తినకూడదు. పరిమిత స్థాయిలో అంటే దేహం నిలబడేందుకు కావల్సిన కనీసస్థాయిలో పండ్లు, పాలు, తీసుకోవాలి. ఇక బీపీ, షుగర్, పిల్లలు, ముసలివారు తమతమ శక్తి అనుసారం ఒక్కపూట అల్ఫాహారం, పండ్లు, పాలు తదితర పదార్థాలతో ఉపవాసం చేయాలి. అంతేకానీ కటిక ఉపవాసం చేసి దేహాన్ని ఇబ్బంది పెట్టకూడదు. ఉండగలిగే వారు మాత్రం తప్పక పూర్తి ఉపవాసం ఉండవచ్చు. కర్షకులు, కార్మికులు, ఉద్యోగులు తమతమ క్రియలకు ఆటంకం లేకుండా ఉపవాస దీక్ష చేయాలి. వారు సాత్వికాహారం తీసుకోవచ్చని పండితులు, శాస్త్రం చెప్తుంది.
అభిషేకంః అలంకార ప్రియుడు విష్ణువు, అభిషేక ప్రియుడు శివుడు. అంటే ఎన్నిసార్లు అభిషేకం చేస్తే అంత సంతసిస్తాడు శివుడు. కాబట్టి శివరాత్రినాడు తప్పక అవకాశం ఉన్నవారు శివాభిషేకం చేయడం లేదా చేయించుకోవడం చేయాలి. ఒక్కో ద్రవ్యంతో అభిషేకం ఒక్కో కామ్యాన్ని ఇస్తుంది. కనీసం శుద్ధ జలంతో మనస్సును లింగస్వరూపంపై పెట్టి హరహర ఓం నమఃశివాయ అంటు అభిషేకం చేస్తే చాలు కోరిన కోర్కెలన్నీ తీరుస్తాడుస్వామి.
బిల్వపత్రార్చనః స్వామికి ఎన్ని పూలు, హారాలు ఇచ్చిన సంతోషపడడు. ఒక్క బిల్వం భక్తితో సమర్పిస్తే చాలు. అదీ నీ హఋదయపుష్పం అయితే మరీ మంచిది. లోకంలో స్వామిది కానిది ఏది. కాబట్టి స్వామిని మనస్ఫూర్తిగా అర్చించి హఋదయకమలాన్ని మనస్సు అర్పిస్తే చాలు. బిల్వపత్రం అంటే మారేడు దళాన్ని లింగోద్భవకాలంలో సమర్పిస్తే మరింతరెట్టింపు ఫలితం వస్తుంది.
జాగరణః పండుగలన్నీ ఉదయం పూట జరుపుకొంటాం. కానీ శివరాత్రి మాత్రం కటిక చీకటి సమయంలో అర్థరాత్రి నిర్వహిస్తారు. అంటే మనలోని అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞాన స్వరూపానికి ప్రతీకగా ఆవిర్భవించిన జ్యోతిర్లింగమూర్తి ఆరాధనే మనలోని జ్ఞానోదయానికి కారణ హేతువు. ఈ సత్యాన్ని ఆవిష్కతమయ్యే సమయం అర్థరాత్రి. ఈ రోజు పూర్తి స్వామి నామస్మరణ, కీర్తన, పారాయణం, ధ్యానం, భజనలు పూజలు, అభిషేకాలతో గడిపితే స్వామి కరుణ మనమీద ఉంటుంది. మనలోని అజ్ఞాన తిమిరాలు పోయి జ్ఞానజ్యోతి కన్పిస్తుంది. చీకట్లు పోయి వెలుగు వస్తుంది. జాగరణ సమయంలో సినిమాలు, భక్తి సంబంధం కానీ అంశాలతో కాలం గడిపితే అది జాగరణ కిందికి రాదు. కేవలం శివాలయంకి వెళ్లడం అక్కడ పూజాభిషేకాలు, భజన కార్యక్రమాల్లో పాల్గొనడం చేయాలి. లేదా ఇంట్లోనైనా కింద కూర్చుని స్వామిని తదైక దీక్షతో అరాధన చేయాలి.
ఈ నాలుగు పనులు చేస్తే అదే మహాశివరాత్రి.. జన్మకో శివరాత్రిగా మనల్ని ఉద్దరిస్తుంది.
– కేశవ