ఐదేళ్ల క్రితం ఇంట్లో పనికి కుదిరాడు. బాగా నమ్మకంగా పనిచేశాడు. అతడిపై నమ్మకంతో ఇంటి యజమాని అమెరికా వెళ్తూ ఇంటి తాళాలు అతడి ఇచ్చాడు. దొంగకే తాళాలు ఇవ్వడం అంటే ఇదేనని యజమానికి తర్వాత అర్థమైంది. యజమానికి యూఎస్‌కి చేరాక పనిమనిషి తనకు అన్నం పెట్టిన ఇంటికే కన్నం వేశాడు. ఇదేదొ చిన్నా చితకా కన్నం కాదండోయ్. ఏకంగా రూ.8 కోట్ల విలువైన నగదు, ఆభరణాలు దోచేశాడు. ఈ విషయం అమెరికాలో ఉన్న ఇంటి యజమానికి తెలిసింది. ఎలా తెలిసిందంటారా..? అందరూ తిన్న ఇంటికే కన్నం వేసే వారుండరుగా.. ఆ ఇంట్లో అసలైన నమ్మకస్థుడు సహాయకుడి రూపంలో ఉన్నాడు. అతడు యజమానికి సమాచారం అందించాడు.
దిల్లీలోని పంజాబీ బాఘ్ ప్రాంతంలోని ఓ ఇంట్లో బిహార్‌కు చెందిన మోహన్ కుమార్ గత ఐదేళ్లుగా పనిచేస్తున్నాడు. ఈ నెల 4వ తేదీన ఇంటి యజమాని తన కుటుంబంతో కలిసి అమెరికా వెళ్తూ ఇంటి తాళాలు కుమార్‌కు ఇచ్చాడు. అయితే, ఈ నెల 18న కుమార్ ఆ ఇంట్లో దొంగతనానికి పాల్పడినట్లు మరో సహాయకుడు యజమానికి సమాచారమిచ్చాడు. కారు, రూ.8 కోట్ల విలువైన నగదు, నగలతో అతడు పరారైనట్లు తెలిపాడు. దీంతో ఇంటి యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. అందులో కుమార్, మరో వ్యక్తితో కలిసి సూట్‌కేసు తీసుకుని యజమాని కారులో వెళ్తున్నట్లు కనిపించింది.
కుమార్ ఆ కారును రమేశ్ నగర్ మెట్రో స్టేషన్ దగ్గర వదిలి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు బిహార్‌కు వెళ్లి నిందితులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.5లక్షల నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మిగతా సొత్తును రికవరీ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.