మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ నుంచి దాదాపు అరడజను కంటే ఎక్కువ మంది హీరోలు ఇండస్ట్రీలో ఉన్నారు. అయితే, వారందరూ ఎవరి దారిలో వారు వెళ్లి తమ సొంత కాళ్లపైన నిలబడే ప్రయత్నం చేస్తున్నారు. మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ సైతం..తనకంటూ ఓప్రత్యేకమైన స్థానం ప్రేక్షకుల హృదయాల్లో ఏర్పరుచుకునే విధంగా సినిమాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు.
‘గని’ చిత్రం ఇటీవల విడుదలై డిజాస్టర్ అయింది. కాగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేసిన F3 ఘన విజయం సాధించింది. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్న వరుణ్ తేజ్..తాజా ఇంటర్వ్యూలో బాలీవుడ్ ఎంట్రీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తన కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫరెంట్ స్టోరిస్ సెలక్ట్ చేసుకోవడంలో ముందుంటున్నాడు హీరో వరుణ్ తేజ్. స్టార్ హీరో ఇమేజ్ పక్కనబెట్టేసి నటుడిగా తనను తాను కొత్త కోణంలో ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. సౌత్ ఇండియన్ ఫిల్మ్స్ కు ప్రజెంట్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందన్న వరుణ్ తేజ్..తనకు అవకాశం వస్తే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తానని, అందుకు సిద్ధంగానే ఉన్నానని తెలిపాడు. తనకు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ అంటే చాలా ఇష్టమని పేర్కొన్నాడు వరుణ్ తేజ్.