ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఇటీవల ఆకస్మాతుగా మరణించిన విషయం తెలిసిందే. మేకపాటి గౌతమ్ రెడ్డి మరణంతో నెల్లూర్ జిల్లా లోని ఆత్మకూర్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. దీంతో ఆత్మకూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నిక అనివార్యం అయింది. త్వరలోనే ఈ ఎమ్మెల్యే స్థానానికి ఉప ఎన్నిక జరగబోతుంది. అయితే ప్రస్తుతం ఆత్మకూర్ నుంచి వైసీపీ నుంచి ఎవరు పోటీలో ఉంటారనే ప్రశ్న అందరీలో ఉంది.
ఇటీవల మరణించిన మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబం నుంచే ఒకరిని నిలబెట్టాలని ఏపీ సీఎం జగన్ తో పాటు వైసీపీ వర్గాలు కూడా భావిస్తున్నాయి. గత కొద్ది రోజుల నుంచి మేకపాటి గౌతమ్ రెడ్డి భార్య కీర్తి రెడ్డి పోటీలో ఉండే అవకాశాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి. అయితే కీర్తి రెడ్డి కాకుండా.. మేకపాటి గౌతమ్ రెడ్డి సోదరుడు.. మేకపాటి విక్రమ్ రెడ్డిని ఆత్మకూర్ ఉప ఎన్నికలో బరిలో ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇప్పటికే మేకపాటి కుటుంబం.. విక్రమ్ రెడ్డి పేరును ఫైనల్ చేసినట్టు సమాచారం. త్వరలోనే వైసీపీ అధినేత జగన్ కూడా విక్రమ్ రెడ్డి పేరును ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.