భారత్-ఆసీస్ టీ20 మ్యాచ్.. హైదరాబాద్ లో రేపు అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు

-

హైదరాబాద్ లోని ఉప్పల్‌ రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో ఆదివారం జరగనున్న ఇండియా-ఆస్ట్రేలియా టీ20 క్రికెట్‌ మ్యాచ్‌ సజావుగా జరిగేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా.. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. బందోబస్తులో 2500 పోలీసు సిబ్బంది పాల్గొంటారని వెల్లడించారు.

మరోవైపు ఉప్పల్ లో రేపు క్రికెట్ మ్యాచ్ సందర్భంగా మెట్రో సంస్థ కూడా ఓ కీలక ప్రకటన చేసింది. మ్యాచ్‌ కోసం మెట్రో రైలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. అభిమానులు ఇళ్లకు చేరుకునేందుకు వీలుగా స్టేడియం మెట్రో స్టేషన్‌ నుంచి ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వెల్లడించింది. రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు సర్వీసులు నడపనున్నట్లు చెప్పింది. 

ఉప్పల్, స్టేడియం, ఎన్‌జీఆర్‌ఐ స్టేషన్లలో మాత్రమే ప్రయాణికులు ఎక్కేందుకు అనుమతిస్తారు. ఇతర స్టేషన్లలో దిగేందుకు అవకాశం ఉంటుంది. అమీర్‌పేట, జేబీఎస్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌ నుంచి ఇతర కారిడార్లలోకి మారేందుకు కనెక్టింగ్‌ రైళ్లు అందుబాటులో ఉంటాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version