గుడివాడ టీడీపీలో ‘మినీ’ వార్: సీటు ఫిక్స్ చేయాల్సిందే!

-

కృష్ణా జిల్లా గుడివాడలో రాజకీయం ఆసక్తికరంగా మారింది…ఇంతకాలం అక్కడ వైసీపీ హవానే నడిచింది…కానీ అనూహ్యంగా గుడివాడలో టీడీపీ రేసులోకి వచ్చింది. పైగా టీడీపీ అధినేత చంద్రబాబు గుడివాడకు రానున్నారు. ఈ నెల 29న జరగనున్న మినీ మహానాడులో పాల్గొనున్నారు. ఇక చాలా రోజుల తర్వాత బాబు..గుడివాడకు రానున్న నేపథ్యంలో మినీ మహానాడుని విజయవంతం చేయాలని టీడీపీ శ్రేణులు సన్నాహాలు చేస్తున్నాయి.

పైగా ఇంతవరకు బయటకురాని నాయకులు సైతం…ఇప్పుడు బయటకొచ్చి టీడీపీలో తిరుగుతున్నారు. దీంతో టీడీపీలో మళ్ళీ సీటు కోసం పోరు మొదలైంది. ఇప్పటివరకు గుడివాడ టీడీపీ ఇంచార్జ్ గా ఉన్న రావి వెంకటేశ్వరరావుకే సీటు వస్తుందని అంతా అనుకున్నారు. కానీ తాజాగా సీనియర్ నేత పిన్నమనేని వెంకటేశ్వరరావు తెరపైకి వచ్చారు..ఇదే క్రమంలో మరో నేత యలవర్తి శ్రీనివాసరావు సైతం ఈ మధ్య యాక్టివ్ అయ్యారు.

దీంతో గుడివాడ సీటు విషయంలో మరోసారి కన్ఫ్యూజన్ మొదలైంది. ఇప్పటికే అభ్యర్ధులని మార్చిన గుడివాడలో కొడాలి నానికి చెక్ పెట్టలేకపోయారు. 2014లో రావికి సీటు ఇస్తే…ఆయన ఓటమి పాలయ్యారు. ఇక 2019లో రావిని పక్కన పెట్టి దేవినేని అవినాష్ ని నిలబెట్టారు. అవినాష్ సైతం..కొడాలిపై ఓడిపోయారు. ఓడిపోయాక ఆయన వైసీపీలోకి వెళ్లారు. దీంతో మళ్ళీ రావిని ఇంచార్జ్ గా పెట్టారు. ఇక ఆయనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని అంతా అనుకుంటున్నారు.

ఈ క్రమంలోనే మినీ మహానాడు సందర్భంగా పిన్నమనేని, యలవర్తి సైతం యాక్టివ్ అయ్యారు. అటు రావి..చంద్రబాబు పర్యటనని విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు. ఇటు పిన్నమనేని, యలవర్తి సైతం అదే పనిలో ఉన్నారు. అంటే ఎవరికి వారే సెపరేట్ గా కార్యక్రమాలు చేస్తున్నారు. దీని వల్ల టీడీపీలో మళ్ళీ గ్రూపు తగాదాలు జరిగేలా ఉన్నాయి. అయితే మినీ మాహానాడులో గుడివాడలో పోటీ చేసే అభ్యర్ధిని ప్రకటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. చూడాలి మరి గుడివాడ సీటు ఎవరికి దక్కుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news