కోర్టుకు వెళ్లిన మంత్రి గంగుల ప్రభుత్వాన్ని ఇరుకున పడేస్తున్నారా ?

-

తెలంగాణ ప్రభుత్వం భూ వివాదాల శాశ్వత పరిష్కారం కోసం కొత్తగా సంస్కరణలు చేపట్టింది. ఇందులో బాగంగా ధరణి పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజాగా ఒక భూ వ్యవహారంలో ప్రభుత్వ యంత్రాంగం నిర్ణయాన్ని సవాలు చేస్తూ మంత్రి గంగుల కమలాకర్ హైకోర్టును ఆశ్రయించారు. అధికారంలో ఉంటే అన్నీ కాళ్ల దగ్గరకు వస్తాయని అనుకుంటారు. అందులోనూ మంత్రిగా ఉంటే ఇక చెప్పేది ఏముంది..కానీ భూమి హక్కుకోసం ప్రభుత్వం పై పిటిషన్‌ వేయడం గంగుల హైకోర్టును ఆశ్రయించడం ప్రభుత్వావర్గాల్లో..అధికార పార్టీలోనూ చర్చకు దారితీస్తోంది.


మంత్రి గంగుల హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ కలెక్టర్‌, వక్ఫ్‌బోర్డులను చేర్చారు. స్వయంగా రాష్ట్ర మంత్రి ఈ విధంగా భూమి హక్కుల కోసం హైకోర్టు తలుపు తట్టడం రాజకీయవర్గాల్లో చర్చగా మారింది. కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి మండలం ఖాజీపూర్ గ్రామంలోని 126 సర్వే నెంబర్‌లో 15 ఎకరాల భూమిని మంత్రి గంగుల కమలాకర్‌ గతంలోనే కొనుగోలు చేశారట. అదే భూమిపై 95 లక్షల రుణం తీసుకుని బ్యాంకుకు చెల్లించినట్టు సమాచారం. అయితే మంత్రి చెబుతున్న భూమి తమదే అంటోంది వక్ఫ్‌బోర్డు.

ఇదే భూమి పై తగాదాలు రావడంతో కొంతమంది రైతులతోపాటు గంగుల కూడా భూ హక్కుల కోసం ప్రభుత్వానికి దరఖాస్తులు ఇస్తూ వచ్చారు.ఇప్పుడీ భూమిని వక్ఫ్‌ ల్యాండ్‌గా పరిగణిస్తూ.. భూ రిజిస్ట్రేషన్‌ విభాగం నిషేధిత భూముల జాబితాలో చేర్చింది. దాంతో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ హైకోర్టును ఆశ్రయించారట గంగుల. గతంలో జాయింట్‌ కలెక్టర్‌ ఇచ్చిన ఆదేశాలలో సదరు భూమిపై మంత్రి గంగులకు హక్కు ఉందని తేల్చారట. వక్ఫ్‌ బోర్డు ఈ భూమిని డీ నోటిఫై చేయకపోవడం వల్లే సమస్య వచ్చిందని హైకోర్టులో వేసిన పిటిషన్‌లో మంత్రి ప్రస్తావించినట్టు తెలుస్తోంది.

మంత్రి పిటిషన్‌పై హైకోర్టు ఎలాంటి తీర్పు వెల్లడిస్తుందో ఏమో..ఆయన తీసుకున్న నిర్ణయం మాత్రం ఈ సందర్బంగా హాట్‌ టాపిక్‌గా మారింది. ధరణిపైనా.. భూమి హక్కుల నిర్ధారణపైనా నిర్ణయం తీసుకున్న ప్రభుత్వంలో మంత్రి గంగుల కమలాకర్‌ సైతం భాగస్వామి. అందుకే ఇప్పుడు గంగుల చర్యలు చర్చకు కారణం అవుతున్నాయి. ప్రభుత్వాన్ని సైతం ఇరుకున పెట్టేలా ఉన్నాయన్న చర్చ నడుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news