కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై పెంచింది బారణ అయితే.. తగ్గించింది చారణ అంటూ మంత్రి హరీష్ రావు తీవ్రంగా విమర్శించారు. ధరలు తగ్గించామని బీజేపీ నేతలు పాలాభిషేకం చేసుకోవడం ఏంటో అర్థం కావట్లేదన్నారు. దమ్ముంటే మార్చి 2014లో ఉన్న ధరలు తీసుకురావాలని బీజేపీ నేతలకు మంత్రి సవాల్ విసిరారు. కేంద్ర పెట్రోల్, డీజిల్ ధరలపై పన్నులు పెంచుతుంటే.. తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి పన్నులు విధించలేదన్నారు. అలాగే గ్యాస్ ధరలు పెంచి.. సిలిండర్ సబ్సిడీ ఎగ్గొట్టిందని విమర్శించారు.
ఈ మేరకు ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కరోనా కొత్త వేరియంట్‌తో ఎలాంటి ప్రమాదం లేదన్నారు. ఇప్పటివరకు ఒక్క కేసు మాత్రమే నమోదు అయిందని, ఆ వ్యక్తి సన్నిహితులను పరీక్షించామని.. ఎలాంటి పాజిటివ్ కేసులు నమోదు కాలేదన్నారు. అలాగే గాంధీ ఆస్పత్రిలో రూ.25 కోట్ల విలువైన అత్యాధునిక టెక్నాలజీతో ఎంఆర్ఐ, రూ.9 కోట్లతో క్యాత్ లాబ్, సిటీ స్కాన్ పరికరాన్ని ప్రారంభించామన్నారు. మరో 100 కోట్లతో గాంధీ ఆస్పత్రిని అభివృద్ధి చేస్తామన్నారు. ఆర్గాన్ ట్రాన్స్ ప్లాంట్ సెంటర్, సంతాన సౌఫల్య కేంద్రాన్ని కూడా త్వరలో ప్రారంభిస్తామన్నారు.