త్వరలోనే లోక్సభ ఎన్నికల షెడ్యూల్ రానున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వివాదస్పదమైన ‘పౌరసత్వ సవరణ చట్టం-2019’ ను అమల్లోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.అయితే ఈ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.దేశంలో మతాల మధ్య చిచ్చు పెట్టేందుకే కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం సీఏఏ అమల్లోకి తీసుకువచ్చిందని సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలను గౌరవించే ఏకైక సెక్యులర్ పార్టీ అని ఆయన అన్నారు.మైనార్టీలు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. ఈ సారి కేంద్రంలో అధికారంలోకి వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని కోమటిరెడ్డి ఆశా భావం వ్యక్తం చేశారు. ఇండియా కూటమి ఆధ్వర్వంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని జోస్యం చెప్పారు.
ఇదిలా ఉంటే….పౌరసత్వ సవరణ చట్టం-2019 కోసం త్వరలో అందుబాటులోకి తెచ్చే పోర్టల్లో పౌరసత్వం కోసం ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని కేంద్రం బాధితులను కోరింది.ఈ చట్టం 2014 డిసెంబరు 31 కంటే ముందు ఆఫ్ఘనిస్తాన్ ,పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, పార్సీలకు ఇవి వర్తిస్తాయి.