రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ జీఎంఆర్ ఏరోసిటీలో అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్ నూతనంగా నిర్మిస్తున్న ఈ-పాజిటివ్ ఎనర్జీ ల్యాబ్స్ కు అమరాజా ఛైర్మన్ గల్లా జయదేవ్, ఎంపీలు రంజిత్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, నీతిఅయోగ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ సలహాదారు సుధేందు సిన్హాలతో కలిసి శుక్రవారం మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. కొవిడ్ వ్యాక్సిన్‌లో దేశంలోనే తెలంగాణ అగ్ర స్థానంలో నిలిచిన తరహాలో ఈ-మొబిలిటీలోనూ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
దేశంలో ఉత్పత్తి అయ్యే ఈ-బ్యాటరీల్లో 60 శాతం తెలంగాణలోనే తయారవుతాయన్నారు. ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగం లో రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెడుతున్న గల్లా జయదేవ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తు అంతా సస్టెనెబులిటీదేనని పేర్కొన్నారు. ప్రతిరోజు కొత్తదనం కోరుకోవడంతోనే అమరరాజా సంస్థ ముందుంటుందని చెప్పారు. తెలంగాణ మొబిలిటీ వ్యాలీని ప్రారంభించిన తర్వాత.. ఎన్నో గొప్ప సంస్థలు రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ముందుకొస్తున్నాయని కొనియాడారు. అందుకు అమరరాజా సంస్థ రంగారెడ్డి జిల్లా దివిటీపల్లిలో నిర్మించిన గిగా ఫ్యాక్టరీ కారిడార్‌లో అధునాతన ఇంధన, పరిశోధన, ఆవిష్కరణ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. ఇందుకు సంబంధించిన ఎవాల్స్ సదస్సులో అమరరాజా సావనీర్‌ను మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు.