తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడింట్ కేటీఆర్ ఈ రోజు నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. నిజామాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఒక బహిరంగ సభలోనూ పాల్గొంటారు. కాగ నేడు ఉదయం 9 గంటలకు బేగంపేట్ విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా.. నిజామాబాద్ జిల్లాలోని వర్ని మండలం సిద్దాపూర్ కు చేరుకుంటారు. 10:30 గంటలకు సిద్దాపూర్ గ్రామంలో నిర్మించబోతున్న రిజర్వాయర్ నిర్మాణ పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారు.
ఈ రిజర్వాయర్ ను రూ. 119.41 కోట్లతో నిర్మించబోతున్నారు. అనంతరం 10:45 గంటలకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించబోతున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. దీని తర్వాత 11 గంటలకు జరగబోయే బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12 :30 గంటలకు హెలికాప్టర్ ద్వారా తిరిగి హైదరాబాద్ కు బయలు దేరుతారు. కాగ మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రంగా ఏర్పాట్లు చేస్తున్నారు. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తో పాటు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కూడా మంత్రి తో నిజామాబాద్ జిల్లా పర్యటనలో పాల్గొంటారు.