సచివాలయంలో ట్రాన్స్ కో ఉన్నతాధికారులతో ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ట్రాన్స్ కో పటిష్టంగా ఉంటేనే మెరుగైన విద్యుత్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ట్రాన్స్ కో ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రూ.3897.42 కోట్లతో పనులు జరుగుతున్నట్లు ఆయన వెల్లండించారు. అంతేకాకుండా వ్యవసాయ విద్యుత్ కోసం రూ. 223.47 కోట్లతో పనులు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ విద్యుత్ పనులను నిర్థిష్ట కాలవ్యవధిలో పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. లో ఓల్టేజీ, ఓవర్ లోడ్ సమస్యలకు పూర్తి స్థాయిలో చెక్ పెట్టాలని ఆయన సూచించారు.
రాష్ట్ర వ్యాప్తంగా అవసరమైన చోట్ల సబ్ స్టేషన్ల నిర్మాణం, డెడికేటెడ్ కేబుల్స్, టవర్స్ నిర్మాణం పనులను వేగవంతం చేయాలన్నారు. గ్రీన్ ఎనర్జీ కారిడార్ కోసం రూ. 941.12 కోట్లతో పనులు జరుగుతున్నాయని, విశాఖపట్నం-చెన్నై కారిడార్లో రూ. 605.56 కోట్ల మేర పనులు జరుగుతున్నాయన్నారు. మూడు జోన్ లలో సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ లో భాగంగా రూ. 762.53 కోట్ల పనులు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. 400 కెవి సామర్థ్యంతో కూడిన విద్యుత్ సరఫరా కోసం రూ. 1257.56 కోట్లతో పనులు చేపట్టామని, ప్రస్తుతం జరుగుతున్న విద్యుత్ పనులకు సంబంధించి ప్రతిఏటా ఎస్ఎస్ఆర్ రేట్లపై రివిజన్ జరగాలన్నారు.