మునుగోడు ఉప ఎన్నికలో ప్రచారం రోజు రోజుకు వేడెక్కుతోంది. అయితే.. మునుగోడుఉప ఎన్నికల్లో భాగంగా నాంపల్లిలోని పలు వార్డులలో పాదయాత్ర, ఇంటింటి ప్రచారం నిర్వహించారు రాష్ట్ర పశుసంవర్దక శాఖ, సినిమాటోగ్రఫీ తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న కార్యక్రమాలతో మునుగోడు ఓటర్లు టీఆర్‌ఎస్ అభ్యర్థికి బ్రహ్మరథం పట్టనున్నారని పేర్కొన్నారు. భారీ మెజార్టీతో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి విజయం ఖాయమని అన్నారు. దేశంలోనే ఆదర్శ వంతమైన పాలన అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రమని తలసాని శ్రీనివాస్ అన్నారు. మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కేసీఆర్‌తోనే సాధ్యమని తలసాని శ్రీనివాస్ తెలిపారు.
24 గంటల కరెంట్, మిషన్ భగీరథ, ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు, ఉద్యోగాల భర్తీ, ఉపాధి అవకాశాలు దేశంలో మరెక్కడా లేదని తెలంగాణలోనే విజయవంతంగా అమలవుతున్నాయని తలసాని శ్రీనివాస్ అన్నారు. సీఎం కేసీఆర్ గడిచిన ఎనిమిది సంవత్సరాలలో సబ్బండ వర్గాలకు మేలు చేసే కార్యక్రమాలు చేశారని చెప్పారు తలసాని శ్రీనివాస్. వారి ఆత్మగౌరవాలను పెంపొందించారని స్పష్టం చేశారు. రాజగోపాల్‌రెడ్డి కాంట్రాక్టుల పని కోసం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని ఆరోపించారు తలసాని శ్రీనివాస్.