నేను ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నానంటూ నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అయితే.. వచ్చే ఎన్నికల్లో పోటీ పై జగన్ నిర్ణయం తీసుకుంటారని, ముందుగా ఊహించుకుని ఇక్కడే పోటీ చేస్తా.. అని చెప్పడం సరి కాదన్నారు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి. ప్రస్తుతం వెంకటగిరి నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా నాకు ఆ అర్హత ఉందని, ఇక్కడ నుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయం.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం ప్రకారం ఉంటుందని ఆయన వెల్లడించారు. ఈ ఐదు సంవత్సరాలూ చివరిరోజు వరకూ వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతానని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వ్యాఖ్యానించారు. మీడియా కథనాల్లో వస్తున్నట్లు నాకు వేరే ఆలోచన అనేది ఉంటే, ముందే చెబుతానని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు.
నా రాజకీయ భవిష్యత్తుపై అప్పటివరకు ఎవరికీ ఏ అనుమానాలు అక్కరలేదని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శిలాఫలకాలపై నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పేరు వేయడం లేదనేది చిన్న విషయమని, నేదురుమల్లి పేరు వేయమని అధికారులను కలెక్టర్ ఆదేశిస్తే కచ్చితంగా వేస్తారన్నారు. ఇటీవల అభివృద్ధి కార్యక్రమాల్లో శిలాఫలకాలను నేదురుమల్లి వర్గీయులు ధ్వంసం చేస్తున్నారన్న ఆరోపణలను ఎవరూ సమర్దించరని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఈపని ఎవరో ఆకతాయిలు చేస్తున్న పని అని, ఎక్కడో ఎవరో ఆకతాయి చేసిన పనికి ఎవరికో అంటకట్టడం సరికాదన్నారు ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి .