హైదరాబాద్‌లోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 ఉన్న బీజేపీ ఎంపీ అరవింద్ ఇంటిపై శుక్రవారం జరిగిన దాడి కేసులో 8 మంది టిఆర్ఎస్ కార్యకర్తలని పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ వాడుతున్న భాష సరిగా లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విమర్శించారు. ఆయన మారకపోతే తాము కూడా మారేది లేదని అన్నారు. అర్వింద్ ఇంటిపై నిన్న జరిగిన దాడి శాంపిల్ మాత్రమేనని చెప్పారు. కల్వకుంట్ల కవిత గురించి అర్వింద్ వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని… అర్వింద్ చరిత్ర గురించి చెపితే ఆయన సిగ్గుతో తలదించుకోవాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ లను అమ్ముకున్న చరిత్ర అర్వింద్ దని చెప్పారు.
అర్వింద్ బీఫామ్ అమ్ముకున్న వారందరినీ తీసుకొచ్చి నిలబెడతానని అన్నారు. కవితపై చేసిన వ్యాఖ్యలను అర్వింద్ వెనక్కి తీసుకోవాలని దానం నాగేందర్ డిమాండ్ చేశారు. అర్వింద్ ఇంటిపై దాడి చేశారంటూ మా వాళ్లను 24 గంటలుగా పోలీస్ స్టేషన్ లో పెట్టారని… వాళ్లంతా ఉద్యమకారులని చెప్పారు. తాము మాట్లాడేందుకు ప్రయత్నిస్తుంటే… పోలీస్ కమిషనర్ ఫోన్ ఎత్తడం లేదని అన్నారు. అర్వింద్ ఇంటిపై దాడి ఘటనలో 50 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. బండి సంజయ్, అర్వింద్ ఇద్దరూ బీసీ ద్రోహులని ఆయన వెల్లడించారు.