‘పాయింట్ బ్లాంక్ లో తుపాకీ గురిపెట్టి చంపుతానని బెదిరించాడు’

-

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి హత్యకు కుట్ర వ్యవహారంలో బంజారాహిల్స్‌ పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడు ప్రసాద్‌… తన కణతపై తుపాకీ గురి పెట్టి చంపుతానని బెదిరించినట్టు జీవన్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

నగరంలోని బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్‌ 12లో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి నివాసానికి సోమవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ప్రసాద్‌ అనే వ్యక్తి వచ్చాడు. నేరుగా జీవన్‌రెడ్డి వద్దకు వెళ్లి తుపాకీని కణతకు గురి పెట్టి చంపుతానని బెదిరించాడు. అప్రమత్తమైన అంగరక్షకులు వెంటనే అతన్ని పట్టుకున్నారు. తనిఖీ చేయగా ప్రసాద్‌ వద్ద రెండు తుపాకులు, కత్తి బయటపడిందని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

సమాచారం వెంటనే పోలీసులకు తెలపడంతో వారు జీవన్‌రెడ్డి నివాసానికి చేరుకుని ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆర్మూర్‌ నియోజకవర్గం కల్లెడ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా ఉన్న లావణ్యను 6 నెలల క్రితం సస్పెండ్‌ చేశారు. ఎమ్మెల్యే సర్పంచ్‌ను సస్పెండ్‌ చేయించారని కక్ష పెంచుకున్న ఆమె భర్త ప్రసాద్‌… జీవన్‌రెడ్డి పై హత్యయత్నం చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు ప్రసాద్‌ను పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news