ఢిల్లీః రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ రోజు 11 గంటలకు పార్లమెంట్ వ్యవహరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నేతృత్వంలో అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నారు. పార్లమెంట్ అనుబంధ భవనం (అనెక్స్ బిల్డింగ్) లో అఖిల పక్ష సమావేశం నిర్వహించనున్నారు.
అఖిల పక్ష సమావేశానికి టిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే.కేశవరావు, లోకసభ లో టిఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు హాజరౌతున్నారు. ఇక ఈ సమావేశంలో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి పాల్గొంటున్నారు.
అటు రాజ్యసభ ఛైర్మన్ ఎమ్.వేంకయ్య నాయుడు నేతృత్వంలో నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. రాజ్యసభ ఛైర్మన్ ఎమ్.వేంకయ్య నాయుడు అధికార నివాసంలో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు రాజ్యసభ లోని అన్ని పక్షాల నేతలతో సమావేశం ఉండనుంది. ఇక ఈ సమావేశానికి రాజ్యసభలో వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు విజయసాయు రెడ్డి హాజరు కానున్నారు.